కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోన్న వేళ టీకా కోసం యునిసెఫ్ అప్పుడే సన్నాహక చర్యలు మొదలుపెట్టింది. వచ్చే ఏడాది ప్రారంభానికి కొవిడ్-19 వ్యాక్సిన్ విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వస్తుందని, వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మద్దతుగా వంద కోట్ల సిరంజీలు సరఫరా చేయనున్నట్టు యునిసెఫ్ తెలిపింది.
సీజనల్‌గా ఈ సమయంలో వచ్చే మీజిల్స్, టైఫాయిడ్ వంటి జ్వరాలకు మరో 62 కోట్ల సిరంజీలు కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది.
'కొవిడ్-19 నివారణకు వ్యాకినేషన్ అన్నది ఇపుడు ప్రపంచ మానవాళి ముందున్న పెద్ద సవాలు. కాబట్టి, వ్యాక్సినేషన్ మొదలుకాగానే మేము కార్యరంగంలోకి దిగుతాం'
--హన్రీఎట్టా ఫోర్, యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
టీకా కూటమిలో భాగమైన ‘గవి’ సంస్థ కార్యక్రమంలో సహకరిస్తుందన్నారు ఫోర్. సిరంజీలతోపాటు యునిసెఫ్ 50 లక్షల రక్షణ పెట్టెలను కొనుగోలు చేస్తుందని, తద్వారా వాడిన సిరంజీలు, నీడిళ్లు సురక్షితంగా పడేయవచ్చని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలకు వ్యాక్సిన్ సరఫరాకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు ఫోర్ వెల్లడించారు. 'అందరికీ సురక్షితమైన వ్యాక్సినేషన్ అందేలా అవసరమైన సిరంజీలు, పరికరాలు కొని గోదాముల్లో భద్రపరుస్తున్నా'ఐక్యరాజ్యసమితి ప్రతినిధి వెల్లడించారు.