కరోనా మహమ్మారి నుంచి రక్షించే వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు టీకాలు తుది దశకు చేరుకోగా... ఆ ఆశలు రెట్టింపయ్యాయి. అయితే.. ప్రతి దేశపు అవసరాల్ని తీర్చే స్థాయిలో వ్యాక్సిన్ డోసులు ఎలా తయారు చేస్తారు? చేసిన వాటిని ఎలా పంపిణీ చేస్తారు? ముందు ఎవరికి ఇస్తారు? అన్న అంశాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సరైన నిర్వహణ లేకపోతే.. పేద దేశాలు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ గురుతర బాధ్యతను యూనిసెఫ్ తన భుజాల మీదకు ఎత్తుకుంది. వ్యాక్సిన్ సేకరణ, పంపిణీ ప్రక్రియల్ని స్వయంగా నిర్వహించనుంది. ఇప్పటికే అనేక వ్యాధులకు సంబంధించి ఏటా 200 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఈ సంస్థ కొనుగోలు చేస్తోంది. వీటిని దాదాపు 100 దేశాల్లో పిల్లలకు అందజేస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆపరేషన్..
తాజాగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీలో పరస్పరం సహకరించుకునేందుకు ఏర్పడ్డ కొవాక్స్ అనే 150 దేశాల కూటమి తరఫున యూనిసెఫ్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద, అత్యంత వేగవంతమైన ఆపరేషన్‌గా నిలవనున్నట్లు అంచనా వేస్తున్నారు. దీనికి రివాల్వింగ్ ఫండ్ ఆఫ్ ద ప్యాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్(పీఏహెచ్‌వో) సహకారం తీసుకోనుంది. ఇందులో భాగంగా 92 దిగువ, దిగువ-మధ్యాదాయ దేశాలకు యూనిసెఫ్ తన సహకారంతో వ్యాక్సిన్ డోసుల్ని అందుబాటులో ఉంచనుంది. ఇక కొవాక్స్‌లో భాగంగా ఉన్న మరో 80 అధికాదాయ దేశాలకు వ్యాక్సిన్ కొనుగోలులో సమన్వయకర్తగా వ్యవహరించనుంది.
అన్ని దేశాలకు సమాన అవకాశం..
ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రభుత్వాలు, ఉత్పత్తిదారులు, పంపిణీ వ్యవస్థల సహకారంపైనే ఆధారపడి ఉందని యూనిసెఫ్ కార్యనిర్వాహక సంచాలకులు హెన్రియెటా ఫోరే తెలిపారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రతి దేశ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యంత భద్రంగా, వేగంగా టీకా అందేలా యూనిసెఫ్ జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. వ్యాక్సిన్‌ను అందిపుచ్చుకోవడంలో ప్రతిదేశానికి సమాన అవకాశాల్ని కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, గవీ ద వ్యాక్సిన్ అలయన్స్, ద కొయిలేషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్, పీఏహెచ్‌ఓ, ప్రపంచ బ్యాంక్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహా మరికొన్ని ఇతర భాగస్వామ్య సంస్థల సహకారం తీసుకోకున్నట్లు తెలిపారు.
నిధుల సమీకరణే కీలకం..
ఇప్పటి వరకు 28 తయారీ సంస్థలు 2023 వరకు తమ కరోనా వ్యాక్సిన్ తయారీ వార్షిక ప్రణాళికను తెలియజేశాయని హెన్రియెటా తెలిపారు. అయితే, భారీ స్థాయి ఉత్పత్తికి పెట్టుబడులు కూడా చాలా అవసరమని సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఇక క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైన వెంటనే జరగాల్సిన ‘అడ్వాన్స్ పర్చేజ్ అగ్రిమెంట్స్’, నిధుల సమీకరణ, నియంత్రణ, ధ్రువీకరణ వంటి ప్రక్రియలు కూడా ఓ కొలిక్కి వచ్చాయని యూనిసెఫ్ తెలిపింది.
వ్యాక్సిన్ కోసం సొంతంగా నిధులు సమకూర్చుకునే సామర్థ్యం ఉన్న దేశాలు సెప్టెంబరు 18 నాటికి కొవాక్స్ కూటమిలో చేరాలని సూచించింది. తద్వారా భారీ ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తికి సహకారం లభిస్తుందని అభిప్రాయపడింది.
ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 2.31 లక్షల కరోనా కేసులు