కొవిడ్-19 పుట్టుక విషయంలో చైనాపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న అమెరికా, ఇప్పటివరకు అందుకు సంబంధించిన సాక్ష్యాలేవీ తమకు ఇవ్వలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తమ దృష్టిలో ఈ ఆరోపణలు ఊహాగానాలు మాత్రమేనని వ్యాఖ్యానించారు డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగం అధిపతి మైకేల్ రయన్. వైరస్ సృష్టికి సంబంధించి అమెరికా ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నా డబ్ల్యూహెచ్‌ఓ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. తమకు అందిన సమాచారం ప్రకారం.. కరోనా వైరస్ సహజసిద్ధంగానే ఉద్భవించిందని పునరుద్ఘాటించారు.
గతేడాది డిసెంబర్లో వెలుగు చూసిన కరోనా వైరస్.. వుహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందని, తమ వద్ద ఆధారాలున్నాయని చెబుతూ వస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ మంత్రి మైక్ పాంపియో.
ఇటీవల ఇదే అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ప్రస్తుతం.. సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే కీలక విషయాలు బయటకు వస్తాయని తెలిపారు.
ట్రంప్ ఆరోపణలు...
కరోనాపై.. ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో చైనా, డబ్ల్యూహెచ్‌ఓ విఫలమయ్యాయని ట్రంప్ ఆరోపిస్తూ వస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ.. చైనాకు ప్రజా సంబంధాల శాఖగా పనిచేస్తున్నట్లు అనిపిస్తోందని, అందుకు ఆ సంస్థ సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో మైకేల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.