సైనిక ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మయన్మార్ ప్రజలు ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సమాజంపై ఆశలు పెట్టుకున్నారని ఐరాస అధికారి ఆండ్రూ క్రిక్‌వుడ్ తెలిపారు. సైనిక పాలనపై పెద్దఎత్తున ఆంక్షలు విధించడం సహా.. పౌరప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు యూఎన్ శాంతి పరిరక్షణ దళాలు జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మయన్మార్‌లో చెలరేగుతున్న హింసపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గూటెరస్ ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు భద్రతా మండలిలోని దేశాలు ఐక్యంగా ఓ నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
మయన్మార్‌లో ప్రజాందోళనలను అణచేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 211 మంది చనిపోయినట్లు క్రిక్‌వుడ్ తెలిపారు. వీరిలో 15 మంది చిన్నారులున్నట్లు పేర్కొన్నారు. ఆందోళనల్లో పాల్గొన్న మరో 2 వేల 400 మందిని సైన్యం నిర్బంధించినట్లు వివరించారు.
చట్టసభ్యుల తీర్మానం
మరోవైపు, మయన్మార్ సైనిక తిరుగుబాటును అమెరికా ప్రతినిధుల సభ తీవ్రంగా వ్యతిరేకించింది. నిర్బంధంలో ఉంచిన వారందరినీ విడుదల చేయాలని ఆ దేశ సైనికాధికారులను డిమాండ్ చేసింది. ప్రజలచేత ఎన్నికైన నేతలే ప్రభుత్వాన్ని నడిపించేలా సైన్యం అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టిన చట్టసభ్యులు సభ్యులు.. భవిష్యత్‌పై మయన్మార్ ప్రజల ఆశయాలను సైనిక తిరుగుబాటు కాలరాసిందని పేర్కొన్నారు. మయన్మార్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆసియా దేశాలతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: