కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో ప్రపంచంలోని పేద దేశాలకు అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు ఊరట కల్పించాయి. మహమ్మారితో పోరాడుతున్న పేద దేశాలు.. ఇప్పుడు చెల్లించాల్సిన రుణ వాయిదాలను ప్రస్తుతానికి నిలుపుదల చేశాయి.
మరోవైపు ప్రపంచంలోని అత్యంత పేద దేశాలకు కరోనాపై పోరాటానికి సాయపడేందుకు ఐక్యరాజ్యసమితి(ఐరాస) 2 బిలియన్ డాలర్లతో ప్రపంచ మానవతా స్పందన ప్రణాళిక నిధిని ప్రారంభించింది.
''ప్రపంచం ఇంతకుముందెన్నడూ చూడని ముప్పును ఎదుర్కొంటోంది. కొవిడ్-19 మహమ్మారి ప్రపంచమంతా విస్తరించింది. వేలాది మందిని బలితీసుకుంది. కోట్లాది జీవితాలను అతలాకుతలం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పడేసింది. మానవాళిని భయపెడుతోంది. అందుకోసం.. ప్రపంచమంతా తిరిగి పోరాడాలి.''
- ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి
ఈ నిధులతో పేద దేశాలు వైద్య పరికరాలు, ప్రయోగశాలలు, రక్షణా పరికరాలు సమకూర్చుకుంటాయని ఐరాస పేర్కొంది. ప్రపంచ జనాభాలో వంద కోట్ల మంది ప్రజలకు సబ్బుతో చేతులు కడుక్కొనే సౌకర్యం లేదని ఈ స్థితిలో కొవిడ్19పై పోరాడేందుకు ప్రణాళిక నిధికి.. నిధులు సమకూర్చడం చాలా అవసరమని పేర్కొంది.