ప్రపంచ దేశాలు మతపరమైన హింసను నిర్మూలించడానికి కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. మత హింసకు బలైన వారి జ్ఞాపకార్థం గురువారం నిర్వహించిన మొదటి అంతర్జాతీయ దినం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
యూదులు, ముస్లింల పట్ల ద్వేషం, వ్యతిరేకత చూపొద్దని... క్రైస్తవులు, ఇతర మత సమూహాలను హింసించడం మానుకోవాలని ఆంటోనియో గుటెరస్ విజ్ఞప్తి చేశారు. మత విశ్వాసాలను తప్పుగా ప్రచారం చేస్తూ.. ఇతర మతస్థుల పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిని నిరోధించాలని ప్రపంచ దేశాలను కోరారు.
చైనా, పాక్... మీరు మారరా?
ఐరాసలో మతపరమైన మైనారిటీల భద్రతపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా... చైనా, పాకిస్థాన్‌లు తమ దేశంలోని మైనారిటీ మతస్థులపై వివక్ష చూపుతున్నాయని యూకే, యూఎస్, కెనడాలు ఆక్షేపించాయి. మతపరమైన మైనారిటీల భద్రతకు... చైనా,పాక్‌లు తగిన చర్యలు తీసుకోవాలని ఐరాస సమావేశంలో సూచించాయి.
"చైనా... తన దేశంలోని ప్రతి ఒక్కరి మానవహక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలను గౌరవించాలని కోరుతున్నాం.
పాకిస్థాన్‌లోని మతపరమైన మైనారిటీలు వివక్షకు గురువుతున్నారు. చట్టపరంగానూ, ఇతరత్రా విషయాల్లోనూ వారు హింసకు గురవుతున్నారు."
- సామ్ బ్రౌన్బ్యాక్, అమెరికా రాయబారి (అంతర్జాతీయ మత స్వేచ్ఛ)
ఇదీ చూడండి: ప్రధాని పర్యటన : యూఏఈలో రూపే కార్డు సేవలు