అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని, వ్యవస్థీకృత నేరాల్ని గుర్తించి, అంతమొందించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి పిలుపునిచ్చింది.
ఉగ్రవాదంపై పోరే లక్ష్యంగా రూపొందించిన పెరూ ముసాయిదా తీర్మానాన్ని ఐరాస భద్రతమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.
"అంతర్జాతీయ, దేశీయ స్థాయిల్లో ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాల మధ్య సంబంధాలు గుర్తించి, రూపుమాపాలి. ఇందుకోసం ప్రపంచదేశాలు తమ మధ్య అన్ని స్థాయిల్లో పరస్పర సమన్వయం పెంచుకుని కృషి చేయాలి"- ఐరాస భద్రతామండలి
"ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై తమ వద్ద ఉన్న నిఘా, కార్యాచరణ సమాచారం, ఆర్థిక మేధస్సును సకాలంలో వేగవంతంగా ప్రపంచ దేశాలు పరస్పరం అందిపుచ్చుకోవాలి. అప్పుడే ఉగ్రవాదంపై పోరులో మంచి ఫలితాలు సాధించడానికి వీలవుతుంది."- పెరూ ముసాయిదా తీర్మానం
ఉగ్రవాదంతోపాటు అక్రమ నగదు చలామణి, అవినీతి, లంచగొండితనాలను రూపుమాపడానికి, వ్యవస్థీకృత నేరాలను అదుపుచేయడానికి...ఆయా దేశాలు పటిష్ఠ చట్టాలను చేయాలని పెరూ తీర్మానం పేర్కొంది.
రాజకీయం చేయొద్దు..
'ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు మధ్య సంబంధాలు?' అన్న ప్రశ్నను రాజకీయం చేయవద్దని రష్యా తన మిత్రదేశాలను భద్రతా మండలిలో కోరింది.
ఇదేం మొదటిసారి కాదు..
అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భద్రతామండలి చేస్తున్న ప్రయత్నాల్లో... తాజా చర్య మొదటిదేమీ కాదు. మార్చి నెలలో ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ప్రపంచ దేశాలు కఠిన చట్టాలు తీసుకురావాలని ఆకాంక్షించింది. ఉగ్రవాద ఫైనాన్సింగ్కు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటాన్ని వేగవంతం చేయాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: బంగ్లాదేశ్లో వరదల బీభత్సం