అమెరికా, చైనా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్ జూన్ నెలలో భేటీ అయ్యే అవకాశముందని శ్వేతసౌధం ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో తెలిపారు. జీ-20 సదస్సుకు అనుబంధంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం, విబేధాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే ఈ చర్చలకు ఇంకా షెడ్యూల్ ఖరారు చేయలేదని తెలిపారు.
అమెరికా, చైనాల మధ్య రెండు రోజులపాటు మరోసారి జరిగిన వాణిజ్య చర్చలు ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిశాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతాయని, అయితే కచ్చితమైన ప్రణాళికలేవీ లేవని లారీ కుడ్లో తెలిపారు.
మరోవైపు భవిష్యత్ వాణిజ్య చర్చల కోసం తమ దేశం రావాలని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ నుచిన్, అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైటిజర్ను చైనా ఆహ్వానించింది.
ఒసాకాలో జూన్ 28-29 తేదీల్లో జరిగే జీ-20 సదస్సుకు ట్రంప్, జిన్పింగ్ హాజరుకానున్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై కూడా వారిరువురూ చర్చించుకునే అవకాశం మెండుగా ఉంది.
చైనాకు ట్రంప్ దెబ్బ
200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై సుంకాలు పెంచారు ట్రంప్. ఫలితంగా చైనా దిగుమతులపై 10 శాతం నుంచి 25 శాతానికి పన్నులు పెరిగాయి. మిగతా చైనా ఉత్పత్తులపైనా పన్నులు విధించాలని అధికారులను ఆదేశించారు. ఫలితంగా సుమారు 300 బిలియన్ డాలర్ల విలువైన డ్రాగన్ దేశ ఉత్పత్తులపై పన్నులు పడనున్నాయి.
ఇరుదేశాల మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందం కుదరకపోవడంపై ట్రంప్ స్పందించారు. చైనాకు ఇదే మంచి సమయమని, మరోసారి తానే అధ్యక్షుడిని అవుతానని, అప్పుడు మరేవిధమైన మినహాయింపులు దక్కవని ట్రంప్ హెచ్చరించారు.
ట్రంప్ చర్యలు అమెరికా అర్థిక వ్యవస్థకే నష్టం చేకూరుస్తాయని రిపబ్లికన్లు అభిప్రాయపడుతున్నారు. అలాంటిదేమీ ఉండదని లారీ కుడ్లో తెలిపారు.
ఇదీ చూడండి: బుర్కినాఫాసో చర్చిపై దాడి.. ఆరుగురి మృతి