అమెరికాలో జాత్యహంకారంపై అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. క్లీవ్‌లాండ్ వేదికగా జరిగిన ఎన్నికల సంవాదంలో భాగంగా ఇరు నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగారు.
జాతి వివక్ష అంశంలో మిమ్మల్ని ఎలా నమ్మాలని ట్రంప్‌ను సూటిగా ప్రశ్నించారు బైడెన్. ఇంత జాత్యహంకారం ఉన్న అధ్యక్షుడిని ఎప్పుడూ చూడలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆఫ్రోఅమెరికన్లు వ్యవస్థీకృత వివక్షకు గురవుతున్నారని, ట్రంప్ హయాంలో జాతి విద్వేషాలు పెరిగాయని మండిపడ్డారు.
అమెరికన్లంతా కలిసి ఈ దేశాన్ని నిర్మించుకున్నామని, మా విధానం ఎప్పటికీ జాతివివక్షకు వ్యతిరేకమేనని బైడెన్ స్పష్టం చేశారు. తాను అధ్యక్షుడు కాగానే పౌరహక్కుల సంఘాలు, పోలీసులతో సమావేశమవుతానని తెలిపారు.
అక్కడే ఎందుకు: ట్రంప్
బైడెన్ ఆరోపణలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. డెమోక్రాట్లు అధికారంలో ఉన్నచోటే సమస్య ఎందుకొస్తోందని ప్రశ్నించారు. ఆ రాష్ట్రాల్లోనే శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని ప్రత్యారోపణ చేశారు. వారు పాలిస్తున్న నగరాల్లోనే హింస చెలరేగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికాను జాత్యహంకార దేశంగా చూపించేందుకు డెమోక్రాట్లు యత్నిస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. వర్ణవివక్ష ఉన్న కొన్ని విధానాలను సంస్కరించేందుకు ప్రయత్నించామని స్పష్టం చేశారు.
ఇప్పుడెందుకు నాటకాలు..
అయితే, ఒబామా హయాంలోనే సమాజంలో ఎంతో అంతరం ఏర్పడిందని తీవ్ర ఆరోపణలు చేశారు ట్రంప్. 1994 బిల్లులో ఆఫ్రోఅమెరికన్లను సూపర్ ప్రిడేటర్లుగా డెమోక్రాట్లు చెప్పారని గుర్తు చేశారు. ఆఫ్రోఅమెరికన్లను చిన్నచూపు చూసిన చరిత్ర డెమోక్రటిక్ పార్టీదేనని స్పష్టం చేశారు. ఎన్నికల కోసం ఇప్పుడు నాటకాలు ఆడటం ఎందుకని బైడెన్‌ను ప్రశ్నించారు.
ఇదీ చూడండి: ట్రంప్ X బైడెన్: కరోనా విషయంలో అబద్ధాలు ఎవరివి?