ట్రంప్... అమెరికా అధ్యక్షుడు. అయితే ఇప్పటివరకు ఏ అధ్యక్షుడికి లేని క్రేజ్ ట్రంప్ సొంతం. ఇందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ఆయన చేసే ప్రకటనలు, హావభావాలు, మాటలు విభిన్నం. అయితే తాజాగా ట్రంప్ మరోసారి ఇలాంటి ప్రకటనే చేశారు. ప్రపంచం మొత్తం కరోనాతో బెంబేలెత్తిపోతుంటే ట్రంప్ ఓ ఉచిత సలహా ఇచ్చారు. అది విని శాస్త్రవేత్తలు అవాక్కయి ముక్కున వేలేసుకున్నారు.
విషయమేంటంటే...
అధ్యయనాలను తనదైన ప్రశ్నలతో ఎప్పుడూ సవాలు చేస్తుంటారు ట్రంప్. ఇప్పుడు మరోసారి కాసింత ట్రంపరితనాన్ని ప్రదర్శించారు. శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనంపై స్పందిస్తూ ఇలా చెప్పుకొచ్చారు.
'వేసవిలో కరోనా వైరస్ బలహీనమవుతుందని అధ్యయనంలో తేలిందిగా.. శరీరంలోకి శక్తిమంతమైన సూర్య కాంతిని పంపించండి' అంటూ శాస్త్రవేత్తలకు సలహా ఇచ్చారు.
అంతంటితో ఆగకుండా ఉపరితలంపై కరోనాను క్షణాల్లో నాశనం చేసే బ్లీచ్, ఐసోప్రొపైల్ ఆల్కాహాల్ వంటి క్రిమిసంహారకాలను నేరుగా శరీరంలోకి పంపించేయండి అన్నారు.
కొవిడ్-19 వైరస్‌పై తమ దేశ శాస్త్రీయ-సాంకేతిక విభాగం, జాన్ హాప్కిన్స్ వర్సిటీతో కలిసి నిర్వహించిన అధ్యయనంపై ఈ విధంగా స్పందించారు అమెరికా అధ్యక్షుడు. ఇది విని శ్వేతసౌధం సభ్యులు అవాక్కయ్యారు.
ట్రంప్ మాటలకు హోంశాఖ సహాయక మంత్రి బ్రయాన్ బదులిచ్చారు.
"లేదు, మేము అధ్యయనంలో కనుగొన్న విషయాల గురించి చెప్పడానికే ఇక్కడున్నాం. ల్యాబ్‌లో అధ్యక్షుడు సూచించినట్టు సూర్యరశ్మిని, క్రిమిసంహారకాలను శరీరంలోకి పంపించలేము."-బ్రయాన్, హోంశాఖ సహాయమంత్రి
ఇది విన్న ట్రంప్ వెంటనే మాట మార్చేశారు.
"అంటే, నేను శరీరంలోకి వాటిని పంపించమనట్లేదు. పరిసరాలల్లో క్రిమిసంహారకాలు, శానిటైజర్లు ఎలా ఉపయోగించాలో చూడాలి అంటున్నాను. "-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అధ్యయనం ఏం చెప్పింది?
యూఎస్ శాస్త్రీయ-సాంకేతిక సంచాలక కార్యాలయం తాజాగా ఓ పరిశోధన చేపట్టింది.
- వేసవిలో సూర్యుడి అతినీలలోహిత కిరణాలు, అధిక ఉష్ణోగ్రత.. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గిస్తాయని ఈ అధ్యయనంలో తేలింది.
- మరో పరిశోధన... బ్లీచ్ వైరస్‌ను ఐదు నిమిషాల్లో నాశనం చేస్తోందని వెల్లడించింది.
- ఐసోప్రొపైల్ కేవలం 30 సెకన్లలో కరోనాను అంతం చేస్తోందని ఈ అధ్యయనంలో తేలింది.
ఇదీ చదవండి:అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకుని 7 కి.మీ నడక