కరోనా సంక్షోభంతో అమెరికాలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. అయితే వైరస్ ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలు వీటిని తెరవలేకపోతున్నాయి. కానీ విద్యావ్యవస్థను పునరుద్ధరించడానికి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా మరో అడుగు ముందుకేసి.. స్కూళ్లు, కళాశాలల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారు. వాటి పన్ను మినహాయింపు స్థితిని వెనక్కి తీసుకుంటానని హెచ్చరించారు.
"అనేక విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు.. విద్యా బోధన చేయడం లేదు. కేవలం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉపదేశాలిస్తున్నాయి. అందువల్ల.. వాటిని పన్ను కట్టడం నుంచి మినహాయించే విషయంపై పునఃసమీక్షించాలని ట్రెజరీ శాఖకు చెప్పాను. మన పిల్లలకు విద్య కావాలి. ఉపన్యాసాలు కాదు."
-- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
అయితే తన వ్యాఖ్యలకు కారణమైన పాఠశాలల వివరాలను ట్రంప్ వెల్లడించలేదు. ఏ విషయాలను ఆధారంగా చేసుకుని ట్రంప్ ఈ ఆరోపణలు చేశారన్న దానిపై స్పష్టత లేదు.
ఇటీవలే.. ఆన్లైన్లో శిక్షణ పొందుతున్న విదేశీ విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లాలని.. లేకపోతే వ్యక్తిగతంగా పాఠాలు చెబుతున్న విద్యాకేంద్రాలకు బదిలీకావాలని ఆదేశించింది ట్రంప్ ప్రభుత్వం. ఇది కూడా విశ్వవిద్యాలయాపై తీవ్ర స్థాయిలో ఒత్తిడిపెంచింది. ట్రంప్ నిర్ణయాన్ని అనేక మంది విమర్శించారు.
ఇదీ చూడండి:- విదేశీ విద్యార్థులకు అమెరికా భారీ షాక్!