కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అమెరికాలో పరిస్థితులు మరింత క్షీణించే అవకాశమున్నట్లు హెచ్చరించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దేశంలో కొవిడ్ తీవ్రత తగ్గిపోయే ముందు, అది మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయితే దేశంలో కొన్ని ప్రాంతాలు మాత్రం వైరస్ కట్టడికి చాలా బాగా పనిచేస్తున్నాయని కొనియాడారు. మిగతా ప్రాంతాల్లో కూడా చర్యలు చేపడుతున్నప్పటికీ దురదృష్టవశాత్తూ పరిస్థితులు మరింత దిగజారుతున్నట్లు ట్రంప్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఆందోళనకరంగా మారినట్లు వెల్లడించారు.
మాస్కు ధరించాల్సిందే..
అత్యంత తీవ్రత కలిగిన ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతిఒక్కరూ ముఖాలకు మాస్కులు ధరించాలని అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు ట్రంప్. ముఖ్యంగా భౌతిక దూరం పాటించలేని సమయంలో మాస్కులు ధరించాలని సూచించారు. 'మీకు నచ్చినా, నచ్చకపోయినా వైరస్ నియంత్రణలో మాస్కులు ప్రభావం చూపిస్తాయి.' అని ట్రంప్ అన్నారు.
కరోనాను అంతమొందించడమే లక్ష్యం..
ఈ సమయంలో కేవలం మహమ్మారిని నియంత్రించడమే కాకుండా దాన్ని అంతం చేయడమే తమ లక్ష్యమని అగ్రరాజ్య అధ్యక్షుడు పునరుద్ఘాటించారు. దీనిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు వస్తున్నాయని.. అందరూ ఊహించిన దానికంటే ముందే ఇవి అందుబాటులోకి వస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కరీబీయన్ దీవుల్లో భారీగా కొకైన్ పట్టివేత