ఉత్తర కొరియాలో మరోసారి పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేశారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ మేరకు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే ప్యాంగ్ యాంగ్ పర్యటనకు బహుశా ఇది సరైన సమయం కాదేమోనని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరోసారి వెళ్తానని స్పష్టం చేశారు. కిమ్‌తో తనకు మంచి స్నేహం ఏర్పడిందని వెల్లడించారు.
" ఉత్తర కొరియాలో పర్యటించేందుకు ప్రస్తుతం మేము సిద్ధంగా ఉన్నామనుకోవటం లేదు. కిమ్‌తో నా స్నేహం మరింత బలపడింది. అయితే ప్యాంగ్ యాంగ్లో పర్యటించేందుకు ఇది సరైన సమయం కాదు. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో పర్యటిస్తా. అలాగే అమెరికాలో పర్యటించేందుకు కిమ్ కూడా ఎంతో ఇష్టపడతాడని అనుకుంటున్నా."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
కిమ్ ప్రత్యేక ఆహ్వానం
ఒకప్పుడు బద్ధశత్రువులుగా ఉన్న అమెరికా-ఉత్తరకొరియా మధ్య గతేడాది నుంచి స్నేహబంధం చిగురించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియా భూభాగంలో అడుగుపెట్టడమే ఇందుకు నిదర్శనం. తాజాగా ట్రంప్‌ను మరోసారి తమ దేశానికి ఆహ్వానించారు ఆ దేశ నాయకుడు కిమ్ జోంగ్ ఉన్. ఈ మేరకు అగ్రరాజ్య అధ్యక్షుడికి గత నెలలో కిమ్ రెండు సార్లు లేఖ రాసినట్లు దక్షిణ కొరియా వార్తపత్రిక వెల్లడించింది.
ట్రంప్‌తో మరోసారి భేటీకి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆగస్టు నెలాఖరులో రాసిన రెండో లేఖలో కిమ్ పేర్కొన్నట్లు సదరు మీడియా కథనం తెలిపింది. ట్రంప్ మరోసారి ఉత్తరకొరియా రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు పేర్కొంది.