అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉత్తర కొరియా అధినేతకు అనూహ్య ఆహ్వానం పంపారు. ఇప్పటికే రెండు సార్లు చర్చలు విఫలమైనా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను మూడోసారి కలిసేందుకు సుముఖంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. జీ-20 సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో పాటు పలు కీలక సమావేశాల అనంతరం దక్షిణకొరియా చేరుకున్నారు ట్రంప్. తన ట్వీట్ చూసి ఉత్తరకొరియా నాయకుడు కిమ్ సరిహద్దు ప్రాంతానికి వస్తే కరచాలనం చేసి హలో చెబుతానన్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు.
అమెరికా అధ్యక్షుడిగా ఉత్తరకొరియాలో అడుగుపెట్టేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ట్రంప్. జపాన్‌లో జరిగిన జీ-20 సమావేశం ముగిసిన అనంతరం ఈ మేరకు ప్రకటన చేశారు.
" కిమ్‌తో నేను భేటీ అవ్వొచ్చని అనుకుంటున్నాను. ఉభయకొరియా సరిహద్దుకు వెళ్తున్నా. కిమ్‌తో కరచాలనం చేస్తానేమో చూడాలి. ఎలాంటి అణుపరీక్షలు నిర్వహించలేదు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించలేదు. అమెరికాకు ఇచ్చిన హామీలను ఉత్తరకొరియా చాలా గొప్పగా నిలబెట్టుకుంది. ఆ దేశంలో ఎన్నో మంచి పనులు జరిగాయి. "
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇరు దేశాల మధ్య ఇప్పటికే రెండుసార్లు చర్చలు విఫలమైన నేపథ్యంలో ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ట్రంప్ నుంచి వచ్చిన ఈ ఆహ్వానం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. దీనిపై స్పందించిన ఉత్తరకొరియా.. ట్రంప్ ఆహ్వానం ఆసక్తిగా ఉన్నప్పటికీ, ఇంకా అమెరికా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదని తెలిపింది. ఇటీవల ట్రంప్, కిమ్ మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి.