ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో మూడో భేటీకి తాను సుముఖంగా ఉన్నట్లు తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సియోల్ పర్యటనలో భాగంగా ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉన్న సైనిక రహిత జోన్లో కిమ్‌ను కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కిమ్ తనను కలిసేందుకు వస్తే అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి హలో చెబుతానంటూ.. ట్వీట్ చేశారు ట్రంప్.
" చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో పాటు పలు కీలక సమావేశాలనంతరం జపాన్ నుంచి దక్షిణ కొరియా వెళ్లనున్నాను. అక్కడ నేను ఉన్నప్పుడు, ఉత్తర కొరియా అధినేత కిమ్ నన్ను కలవడానికి వస్తే ఇరు దేశాల మధ్య ఉన్న సైనిక రహిత జోన్ (జీఎంజెడ్) వద్ద కలుస్తాను. షేక్ హాండ్ ఇచ్చి హలో చెప్పటానికి మాత్రమే!"
- డొనాల్డ్ ట్రంప్,అమెరికా అధ్యక్షుడు
హనోయ్‌లో ట్రంప్-కిమ్ శిఖరాగ్ర సమావేశం ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిసిన అనతరం ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కిమ్‌తో భేటీకి ట్రంప్ సుముఖత తెలపటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో వియత్నాం వేదికగా ట్రంప్- కిమ్ రెండోసారి భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశం విఫలమైంది. అనంతరం ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు ఎలాంటి సంప్రదింపులు లేవు. జూన్‌లో కిమ్ తనకు అందమైన లేఖ రాసినట్టు ట్రంప్ తెలిపారు.
ఇదీ చూడండి: జీ20 సదస్సు: అందరి కళ్లు పుతిన్ 'మగ్'పైనే