కరోనా వైరస్‌తోపాటే కలిసి జీవించడాన్ని అమెరికన్లు నేర్చుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. వైరస్ ప్రభావం తక్కువగానే ఉందన్న ఆయన, సాధారణ ఫ్లూ మాదిరిగానే దీన్ని కూడా భావించాలని అన్నారు. వైరస్ బారినపడిన ట్రంప్, ఆసుపత్రి నుంచి వైట్‌హౌస్‌కు చేరుకున్న మరునాడు కరోనాపై మరోసారి ఈ విధంగా స్పందించారు.
'ఫ్లూ సీజన్ వస్తోంది. ఈ ఫ్లూ కారణంగా ప్రతిసంవత్సరం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాక్సిన్ ఉన్నప్పటికీ ఒక్కోసారి లక్షకుపైగా మరణాలు ఉంటున్నాయి. అలాంటప్పుడు దేశాన్ని మూసివేసి ఉంచుతున్నామా? లేదు కదా, దానితోపాటే కలిసి జీవించడం నేర్చుకున్నాము. అదేవిధంగా కొవిడ్ వైరస్‌తోనూ కలిసి జీవించడం నేర్చుకోవాలి' అని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు.
అంతకుముందు, కొవిడ్ మహమ్మారి గురించి ఎవరూ భయపడొద్దని.. మన జీవితాలపై వైరస్ ఆధిపత్యం ప్రదర్శించకుండా చూసుకోవాలని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ప్రస్తుతం వైట్‌హౌస్‌లో వైద్య నిపుణుల పర్యవేక్షణలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు.