చారిత్రక కట్టడాలు, విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారిందరినీ శిక్షించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై త్వరలో సంతకం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. విధ్వంసాలకు పాల్పడిన వారిని అరాచకవాదులుగా, నేరస్థులుగా ఆయన అభివర్ణించారు.
సోమవారం శ్వేతసౌధానికి సమీపంలోని లాఫాయెట్ స్క్వేర్‌లో ఉన్న మాజీ అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ విగ్రహాన్ని కూల్చివేయడానికి కొంత మంది నల్లజాతి నిరసనకారులు ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన పోలీసులు... ఆందోళనకారులపై పెప్పర్ స్ప్రే ప్రయోగించి, విగ్రహానికి ఏమీ కాకుండా చేయగలిగారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
అరాచకవాదులు
చారిత్రక విగ్రహాలను, స్మారకాలను నాశనం చేసే వారిని తీవ్రమైన నేరస్థులుగా, అరాచకవాదులుగా ట్రంప్ అభివర్ణించారు. వారిపై చర్య తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యం చేయకపోతే.. అందుకు మేము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. విధ్వంసాలకు పాల్పడిన అరాచకవాదులకు దీర్ఘకాలిక శిక్షలు విధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.
"కొంత మందికి నా భాష నచ్చదు. కానీ అదే నిజం. దేశానికి చెందిన స్మారక చిహ్నాలను ధ్వంసం చేసేవారు కచ్చితంగా అరాచకవాదులు. వారికి దేశంపై ఎలాంటి ప్రేమ లేదు. అందుకే వారిని శిక్ష విధించడం తప్పనిసరి."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
చరిత్ర నుంచి నేర్చుకోండి
నిరసనకారులు విగ్రహాలను ధ్వంసం చేయడం ఆపాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు. స్మారకాల ద్వారా దేశ ఘన చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. అది వినకపోతే శిక్ష తప్పదని హెచ్చరించారు.
చట్టాలు మారాలి
ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ఓ తెల్లజాతి పోలీసు చేతిలో మరణించిన తరువాత.. నల్లజాతి అమెరికన్లు పోలీసుశాఖలో సంస్కరణలు చేపట్టాలని ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా లింకన్ మెమోరియల్, మహాత్మా గాంధీ విగ్రహం, వైట్‌హౌస్ ముందున్న చారిత్రక చర్చితో సహా పలు జాతీయ స్మారక చిహ్నాలు, విగ్రహాలను ధ్వంసం చేశారు.
ఇదీ చూడండి: చైనా వెన్నుపోటు- నేపాల్ భూభాగం దురాక్రమణ