ఈ ఏడాది చివర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోతే ఆ పదవి నుంచి ప్రశాంతంగా వైదొలుగుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. నవంబర్ 3న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి గెలవలేని పక్షంలో శ్వేతసౌధాన్ని ట్రంప్ అంత సులువుగా విడిచి వెళ్లరని వస్తున్న వార్తలను ఆయన ఖండిచారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమి అమెరికన్లకు ఏమాత్రం మంచి పరిణామం కాదని ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు ట్రంప్.
పదవీకాలంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ట్రంప్‌కు కరోనా సంక్షోభం, జార్జ్ ఫ్లాయిడ్ మృతి అంశాలు ఇబ్బందికరంగా మారాయి. మరికొద్ది రోజుల్లో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉండగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల అభ్యర్థి, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోనున్నారు ట్రంప్. నల్ల జాతీయుల్లో దాదాపు 70 శాతానికిపైగా బిడెన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు ఇటీవలే ఓ సర్వే సంస్థ వెల్లడించింది.