అమెరికా సైన్యానికే టెక్ దిగ్గజ సంస్థ 'గూగుల్' సాయం అందిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చైనా మిలటరీకి గూగుల్ సహకరించట్లేదని ట్రంప్ స్పష్టం చేశారు. గూగుల్ సంస్థ ముఖ్యకార్యనిర్వహణ అధికారి సుందర్ పిచాయ్‌తో భేటీ అనంతరం ట్రంప్ ఈ ట్వీట్ చేశారు.
చైనాలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న గూగుల్... ఆ దేశ సైన్యానికి సాయం అందిస్తోందని కొద్దిరోజుల క్రితమే ట్రంప్ ఆరోపించారు. గూగుల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం పిచాయ్‌తో తొలిసారి భేటీ అయ్యారు ట్రంప్. గూగుల్ సంస్థ అమెరికా అభివృద్ధికే కట్టుబడి ఉందని సుందర్ పిచాయ్ స్పష్టం చేసినట్లు ట్వీట్ చేశారు ట్రంప్.
" గూగుల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుందర్ పిచాయ్‌తో భేటీ అయ్యా. గూగుల్ పూర్తిగా అమెరికా సైన్యానికే సాయం చేయటానికి కట్టుబడి ఉన్నట్లు పిచాయ్ తెలిపారు. చైనా మిలటరీకి సహకారం అందించట్లేదని స్పష్టం చేశారు.
రాజకీయాలతో పాటు దేశాభివృద్ధికి గూగుల్ సంస్థ సాయం చేయగలిగే అంశాలపై చర్చించాం. సమావేశం ఆశాజనకంగా జరిగింది."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సామరస్య భేటీ జరిగినందుకు ఆనందంగా ఉందని గూగుల్ అధికార ప్రతినిధి ప్రకటించారు. ట్రంప్ ట్వీట్‌పై సుందర్ పిచాయ్ ఇంకా స్పందించలేదు.
"దేశంలో నూతన సాంకేతక పరిజ్ఞాన అభివృద్ధి, ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంతో కలిసి గూగుల్ చేస్తోన్న ప్రాజెక్టులు తదితర అంశాలపై అధ్యక్షుడితో భేటీలో చర్చించాం."
- గూగుల్ అధికార ప్రతినిధి