జీ7 శిఖరాగ్ర దేశాల సదస్సు నిర్వహణ వేదికపై స్పష్టతనిచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తన అధికారిక క్యాంప్ డేవిడ్ రెసిడెన్సీలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలుత ట్రంప్‌కు చెందిన గోల్ఫ్ రిసార్ట్‌లో జీ7 సదస్సు నిర్వహించాలని భావించినా.. సర్వత్రా విమర్శలు ఎదురవడం వల్ల ఆ వేదికను మార్చారు అమెరికా అధ్యక్షుడు.
లండన్‌లో జరుగుతున్న నాటో సదస్సులో భాగంగా జీ7 నాయకులు, కెనడా ప్రధాన మంత్రి జుస్టిసన్ ట్రుడీయూతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు ట్రంప్.
వచ్చే ఏడాది జూన్ 10 నుంచి 12 వరకు జీ7 సదస్సు జరగనుంది. తొలుత ఈ సమావేశానికి మియామిలోని ట్రంప్ నేషనల్ డోరల్ రిసార్ట్‌లో ఆతిథ్యం ఇవ్వాలని అగ్రరాజ్య అధ్యక్షుడు భావించారు. అయితే సొంత లబ్ధికోసమే రిసార్ట్‌లో ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కారణంగా వేదికను మారుస్తున్నట్లు వెల్లడించారు.