అమెరికాలో కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా కొత్త కేసులు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు మరో నాలుగు వారాల పాటు ఇళ్లకే పరిమితవ్వాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సూచించారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) సూచించిన మార్గదర్శకాలను పాటించాలని కోరారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని, అవి కూడా సాధారణమైనవి లేదా ఇళ్లల్లో తయారు చేసుకున్నవై ఉండాలన్నారు. మెడికల్ మాస్కులు, ఎన్-95 మాస్కులు ధరించారదన్నారు. అత్యవసర విభాగాల్లో పనిచేసేవారికి, వైద్య సిబ్బందికి ఆ మాస్కులు ఉపయోగకరమని పేర్కొన్నారు. అలాగే మాస్కులు ధరించినంత మాత్రాన సామాజిక దూరం పాటించకపోవడం, ఇళ్లలో ఉండకుండా బయటకు రావడం లాంటివి చేయకూడదని హెచ్చరించారు ట్రంప్.
'నేను మాత్రం ధరించను'
ప్రజలందరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించిన ట్రంప్.. తాను మాత్రం ధరించబోనని చెప్పారు.
" శ్వేతసౌధం ఓవల్ కార్యాలయంలో అందమైన వాతవరణంలో కూర్చొని దేశ అధ్యక్షులకు, రాజులకు, రాణులకు, అగ్రనేతలకు శుభాకాంక్షలు చెబుతూ ఉంటాను. మాస్క్ ధరించి నన్ను నేను ఊహించుకోలేను. అందుకే ధరించను."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
మాస్కులు ధరించాలా? వద్దా?
కరోనా నియంత్రణకు అందరూ మాస్కులు, వీలైతే స్కార్ఫ్ల వంటివి ధరించాలనే సూచనపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలా? వద్దా? అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.
కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న న్యూయార్క్‌లో చాలా మంది మాస్కులు లేకుండానే పార్క్‌లలో వ్యాయామాలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: అమెరికాలో కరోనా వికృత రూపం- 24 గంటల్లో 1,480 మంది మృతి