అధ్యక్ష ఎన్నికలపై ఆదివారం ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు చేశారు డొనాల్డ్ ట్రంప్. ఓటింగ్ పూర్తి అవినీతిమయంతో జరిగిందని ఆరోపించారు. వాటిని తన నుంచి దోచుకున్న ఎన్నికలుగా అభిప్రాయపడ్డారు. స్వింగ్ రాష్ట్రాల్లోని ఓట్ల కోసం మోసాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
" వీళ్లు దొంగలు(బైడెన్ వర్గం). ఓటింగ్ అంతా అవినీతిమయం. కొన్ని రాష్ట్రాల్లో అసలు బైడెన్ గెలవటం అసాధ్యం. వాళ్లు ఏం దోచుకోవాలనుకున్నారో అది దోచుకున్నారు."
--డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
ట్రంప్ అనుకూల వర్గాలు ప్రస్తుతం 'ఎలక్షన్ డిఫెన్స్ ఫండ్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా ఎన్నికల ప్రక్రియపై సుప్రీంకోర్టులో పోరాడేందుకు విరాళాలనూ సేకరిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రంప్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.
"రాడికల్ లెఫ్ట్ సిద్ధాంతాల నుంచి కేవలం నువ్వు(అమెరికా పౌరులు) మాత్రమే అమెరికాను కాపాడగలవు. నీ దేశాన్ని ఎక్కడా తలవంచనీయకు" అని ట్రంప్ ట్వీట్ చేశారు.
మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా డెమొక్రాట్లపై విమర్శలు గుప్పించారు. వాళ్లు అగ్రరాజ్యాన్ని నాశనం చేస్తారని ఆరోపించారు. అయితే వీరిద్దరి ఆరోపణలను బైడెన్ వర్గాలు తోసిపుచ్చాయి.