వేలాది మంది భారతీయుల కలల్ని నీరాగార్చే నిర్ణయం తీసుకోనున్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. హెచ్1బీ వీసాలను ఈ ఏడాది చివరి వరకు తాత్కాలికంగా రద్దు చేసే ఉత్తర్వులపై ఆయన సంతకం చేయనున్నట్లు శ్వేతసౌధం అధికారిక వర్గాలు తెలిపాయి. ఒకటి, రెండు రోజుల్లోగా వీసాల జారీకి సంబంధించి కీలక ప్రకటన ఉంటుందని ఫాక్స్ న్యూస్‌తో ఇప్పటికే సూచనప్రాయంగా చెప్పారు ట్రంప్.
కరోనా సంక్షోభం కారణంగా నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిన నేపథ్యంలో అమెరికన్లకు అవకాశాలు కల్పించాలనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే అమెరికాలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
70 శాతం మంది భారతీయులే...
అమెరికా ఏటా 85వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తోంది. వీటిలో దాదాపు 70శాతం భారతీయ ఐటీ నిపుణులకే దక్కుతున్నాయి. ట్రంప్ తాజా నిర్ణయం వీరిపై తీవ్ర ప్రభావం చూపనుంది.
హెచ్1బీతో పాటు తాత్కాలిక ఉపాధి వీసాలు హెచ్-2బీ, జే-1, ఎల్-1 వీసాలను కూాడా రద్దు చేసే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: భారత్, చైనాల మధ్య క్లిష్ట పరిస్థితులు: ట్రంప్