కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తనకు కరోనా తగ్గిందని, దీనిని గోప్పగా భావిస్తున్నట్లు చెప్పారు. అధ్యక్షుడికి కరోనా చికిత్స పూర్తయిందని, ఆయన ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ముప్పు లేదని శ్వేతసౌధం వైద్యులు తెలిపిన మరుసటి రోజునే ఈ మేరకు ప్రకటించారు ట్రంప్. అయితే.. అధ్యక్షుడికి కరోనా నెగిటివ్‌గా తేలినట్లు మాత్రం వైద్యులు వెల్లడించకపోవటం గమనార్హం.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి సోమవారం పూర్తిస్థాయి బహిరంగ ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్నారు ట్రంప్. ఈ సందర్భంగా వైరస్ సోకకుండా పూర్తిస్థాయి రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నానని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఫ్లోరిడాలో ప్రచార కార్యక్రమం తర్వాత రోజుల్లో పెన్సిల్వేనియా, లోవా ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు.
" నాలో రోగ నిరోధక శక్తి పెరిగింది. ఇది ఎంత కాలం ఉంటుందో? బహూశా జీవిత కాలం ఉండొచ్చు. ఎవరికీ తెలియదు. ఒక విషయం చెప్పాలి. నేను చాలా ఆనందంగా ఉన్నా. రోగ నిరోధక శక్తి వేరు.. మాస్కులు కట్టుకోవటం వేరు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం ముఖ్యం. ఆ భయంకరమైన చైనా వైరస్‌ను జయించా. మీకు ఆరోగ్య వంతుడైన అధ్యక్షుడు ఉన్నారు. ప్రత్యర్థిలా బేస్ మెంట్లో దాక్కునే వ్యక్తి కాదు. "
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అందించాల్సిన కొవిడ్-19 చికిత్సపూర్తయినట్లు శ్వేతసౌదం వైద్యుడు డాక్టర్ సియాన్ కాన్లే గత శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆయనతో వైరస్ వ్యాప్తి ముప్పు లేదని తెలిపారు. కానీ, ప్రకటనలో నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించలేదు. అయితే.. పీసీఆర్ పరీక్షల వంటి వాటిల్లో వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇంత త్వరగా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం లేదని ప్రకటించటంపై కొందరు వైద్య నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. కేవలం 10 రోజుల చికిత్సతోనే ఈ విధంగా కోలుకునే అవకాశం లేదన్నారు.
వైరస్ నుంచి కోలుకున్నాక తొలిసారి శ్వేతసౌధం సౌత్లాన్స్ బాల్కనీ నుంచి గత శనివారం మధ్యాహ్నం మద్దతుదారులతో మాట్లాడారు ట్రంప్. ఈ కార్యక్రమానికి వందలాది మంది రిపబ్లికన్ మద్దతుదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని భరోసా కల్పించారు. తన కోసం ప్రార్థనలు చేపట్టిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారి త్వరలోనే అంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ఉద్యోగాలపై ట్రంప్, బైడెన్ మాటల యుద్ధం