అగ్రరాజ్యంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఉత్తరకొరియా సుముఖంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను, కిమ్‌జాంగ్ మూడోసారి భేటీ అవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. సరైన సమయంలో ఇది జరుగుతుందని అన్నారు.
చర్చలు ముందుకుసాగాలంటే అమెరికా వ్యవహార శైలిని మార్చుకోవాలని ఉత్తరకొరియా విదేశాంగ ప్రతినిధి రెండురోజల క్రితమే స్పష్టం చేశారు. గతేడాది జూన్‌లో రెండు దేశాలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
తమ సహనం పూర్తిగా నశించక ముందే అమెరికా సరైన నిర్ణయం తీసుకోవాలని ఉత్తరకొరియా తేల్చిచెప్పింది. వీలైనంత త్వరగా స్పందన తెలియజేయాలని సూచించింది.
వియత్నాంలో ట్రంప్-కిమ్ మధ్య జరిగిన రెండో భేటీ ఎలాంటి పురోగతి లేకుండానే అర్ధంతరంగా ముగిసింది. అనంతరం పలు క్షిపణి ప్రయోగాలు నిర్వహించింది ఉత్తరకొరియా.
అంతర్జాతీయ ఆంక్షలను అతిక్రమించారన్న కారణంతో ఉత్తరకొరియాకు చెందిన ఓ సరుకు రవాణా ఓడను అమెరికా ఇటీవలే అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదీ చూడండి: జాత్యహంకార వీడియోలపై యూట్యూబ్ నిషేధం