ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పాకిస్థాన్‌తో బలహీనపడిన సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించినట్లు శ్వేతసౌధం పేర్కొంది. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో భాగంగా మంగళవారం ఇరువురి మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీపై అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఐరాస వార్షిక సదస్సులో భాగంగా ట్రంప్‌తో నాలుగోసారి భేటీ అయ్యారు మోదీ. ఈ సమావేశంలో సుమారు 40 నిమిషాల పాటు ద్వైపాక్షిక వాణిజ్యం, పాకిస్థాన్ ఎగదోస్తున్న తీవ్రవాదానికి సంబంధించిన సమస్యలపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపింది శ్వేతసౌధం.
" ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత సహకారాల్లో పురోగతిని ట్రంప్ గుర్తు చేశారు. పాకిస్థాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని మోదీని అధ్యక్షుడు ట్రంప్ ప్రోత్సహించారు. కశ్మీర్ ప్రజలకు మెరుగైన జీవనం కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు."
- శ్వేతసౌధం.
ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అఫ్గానిస్థాన్‌లోని పరిస్థితులపై ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది శ్వేతసౌధం. అక్కడ భద్రత పెంపు, అభివృద్ధికి ఏ విధంగా కలిసి పనిచేయాలనే అంశంపై చర్చించినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: గ్రెటా థన్‌బర్గ్‌కు 'ప్రత్యామ్నాయ నోబెల్' పురస్కారం