కరోనా నియంత్రణకు మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ బ్రహ్మాండంగా పనిచేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టిగా నొక్కి వక్కాణించారు. 'కొవిడ్ నియంత్రణకు మలేరియా ఔషధం ఉపయోగపడుతుంది' అంటూ... ట్రంప్ చెబుతున్న వీడియోలను సామాజిక మాధ్యమ వేదికలు తొలగించిన గంటల వ్యవధిలోనే ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉపయోగం లేదు..
మానవాళిని కబలిస్తున్న కరోనా మహమ్మారిని హైడ్రాక్సీక్లోరోక్విన్ నియంత్రించలేదని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ స్పష్టం చేశారు. శ్వేతసౌధం కూడా ఈ ఔషధాన్ని వినియోగించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే దీనిని ట్విట్టర్ వేదికగా ట్రంప్ వ్యతిరేకించారు. పలువురు వైద్యులు మలేరియా ఔషధాన్ని సమర్థిస్తున్న వీడియోను ఆయన పోస్టు చేశారు.
"కొవిడ్ వ్యాధిని నియంత్రించేందుకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉపయోగపడుతుందని చాలా మంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు. వారిలో ఓ అద్భుతమైన మహిళా వైద్యురాలు కూడా ఉన్నారు."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ట్రంప్ అనుకూల వైద్యులు
ట్రంప్ అనుకూల రాజకీయ కార్యాచరణ కమిటీకి 'టీ పార్టీ యాక్షన్ పేట్రియాట్స్ యాక్షన్' అనే డార్క్ మనీ గ్రూప్ నిధులు అందిస్తోంది. ఈ గ్రూప్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమెరికా ఫ్రంట్లైన్ వైద్యులు పాల్గొన్నారు. వీరు హైడ్రాక్సీక్లోరోక్విన్ కరోనాను నియంత్రిస్తుందని అభిప్రాయపడ్డారు.
హానికరం..
కొవిడ్ రోగులు హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడడం వల్ల మంచి కంటే హాని కలిగే అవకాశముందని పలు శాస్త్రీయ అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ఇదీ చూడండి: 'అమెరికాలో సంక్షోభం సృష్టించేందుకు రష్యా ప్రయత్నం'