కరోనా వైరస్ తీవ్రత గురించి హెచ్చరించినప్పటికీ చెవికెక్కించుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే విమర్శల పాలయ్యారు. తాజాగా న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వేదికగా ఇలాంటి వ్యాఖ్యలతో ఓ బిల్‌బోర్డు దర్శనమిచ్చింది. 'ట్రంప్ డెత్ క్లాక్' పేరుతో న్యూయార్క్‌కు చెందిన సినీనిర్మాత యూజీన్ జారెకి దాన్ని ఏర్పాటు చేశారు. ట్రంప్ తగిన సమయంలో చర్యలు తీసుకొని ఉంటే ఆపగలిగే మరణాల సంఖ్యను దాని మీద ప్రదర్శించారు.
![Trump Death Clock telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7166323_clock500000.jpg)
కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు అమెరికాలో 81వేలకు పైగా మరణాలు సంభవించాయి. అయితే ట్రంప్ యంత్రాంగం సరైన సమయంలో స్పందించి ఉంటే 48,000 పైగా మరణాలను అరికట్టగలిగేవాళ్లమని జారెకి విమర్శించారు.
మార్చి 16న కాకుండా మార్చి 9 నుంచే సామాజిక దూరం, పాఠశాలల మూసివేత వంటి కఠిన నిబంధనలు అమలు చేసి ఉంటే ఆ మరణాలు సంభవించేవే కాదని ఆ డెత్ క్లాక్‌లో ఆయన పేర్కొన్నారు. ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ వ్యాఖ్యలను అనుసరించి నిపుణులు వేసిన లెక్కల ఆధారంగా... అరికట్టగల మరణాలు 60 శాతంగా ఉన్నాయన్నారు.
ముందుగానే నిబంధనలను అమలు చేసుంటే, మరింత మందిని కాపాడగలిగేవాళ్లమని గతంలోనూ ఫౌచీ మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించారు జారెకి. అందుకే సంక్షోభాన్ని ఎదుర్కోడానికి మరింత సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నామని ఆ నిర్మాత క్లాక్ మీద రాసుకొచ్చాడు.
"యుద్ధంలో చనిపోయిన సైనికుల సేవలకు గుర్తుగా పేర్లను స్మారకాల మీద రాసినట్లుగా, ట్రంప్ యంత్రాంగం ఆలస్యంగా స్పందించినందుకు కోల్పోయిన ప్రాణాల సంఖ్యను ప్రజలకు వెల్లడించడం ఇప్పుడు అత్యవసరం"
-- యూజీన్ జారెకి, సినీ నిర్మాత
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 42 లక్షలు దాటేయగా.. ఒక్క అమెరికాలోనే 13 లక్షలకు పైగా బాధితులు ఉన్నారు. ప్రపంచంలో 2,87,543 మంది మహమ్మారి దెబ్బకు చనిపోగా.. అగ్రరాజ్యంలో 81 వేల మందికి పైగా మృతిచెందారు.