అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి బో బైడెన్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. తమదైన రీతిలో ప్రచార కార్యక్రమాలతో పాటు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇండో-అమెరికన్, ఆఫ్రికన్-అమెరికన్ ఓట్లను ఆకర్షించేందుకు భారత సంతతి మహిళ కమాలా హ్యారిస్‌కు ఉపాధ్యక్ష పదవికి నామినేట్ చేశారు బైడెన్. అయితే ట్రంప్ కూడా ఇండో-అమెరికన్లను ఆకర్షించేందుకు ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీనే రంగంలోకి దించారు. ఎలా అంటారా..?
వీడియోతో చెప్పించారు...!
"ఫోర్ మోర్ ఇయర్స్" పేరిట విడుదలైన 107 సెకన్ల ట్రంప్ ప్రచార వీడియోలో.. మోదీ కనిపించారు. గతేడాది మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో హ్యూస్టన్‌లోని ఎన్ఆర్జీ స్టేడియంలో 'హౌడీ మోడీ' పేరిట భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ చారిత్రక కార్యక్రమంలో దాదాపు 55 వేల మందికి పైగా ఇండో-అమెరికన్లు హాజరయ్యారు. అయితే ఆ వేదికపై మోదీ-ట్రంప్ చేయి పట్టుకొని తీసుకున్న ఫొటో, ప్రసంగం సన్నివేశాలను తాజాగా తమ వీడియోలో పెట్టింది ట్రంప్ ప్రచార బృందం.
ఆ సభలో ప్రసంగించిన మోదీ.. ట్రంప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని పేర్కొన్నారు. దాదాపు అన్ని దేశాల చర్చల్లో ఆయన పేరు ప్రస్తావనకు వస్తుందని కితాబిచ్చారు. ఆ బైట్‌ను ప్రచార వీడియోలో పెట్టింది ట్రంప్ బృందం.
ఇండో-అమెరికన్లలో మోదీకి విశేషాదరణ ఉంది. ఆయన చెప్తే ప్రజలు వింటారని ట్రంప్ వర్గానికి నమ్మకం. అంతేకాదు 2015లోనూ మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో, 2017లో సిలికాన్ వ్యాలీలో మోదీ ప్రసగించారు. ఒక్కో కార్యక్రమానికి దాదాపు 20 వేల మందికి పైగా హాజరయ్యారు. అమెరికాలో భారీ ర్యాలీల్లో పాల్గొన్న విదేశీ నేత ప్రధాని మోదీ మాత్రమే. కాబట్టి మోదీ ఇమేజ్ను తన ప్రచారం కోసం వాడుకోవాలని ట్రంప్ వర్గం భావిస్తోంది.
వాళ్లను ఆకర్షించేందుకే...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా ఉన్న ఇండో-అమెరికన్ల ఓట్ బ్యాంక్‌ను ఒడిసిపట్టాలని ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇండో-అమెరికన్లు దాదాపు 25 లక్షల మంది ఈ ఏడాది ఓటింగ్‌లో పాల్గొంటారని అంచనా. మిషిగన్, పెన్సిల్వేనియా, ఒహాయో ప్రాంతాల్లో ఇండో-అమెరికన్లకు మంచి పట్టు ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్న సిక్కులు, హిందువుల కోసం ప్రత్యేకంగా గ్రూప్‌లు పెడుతున్నాయి ఆయా పార్టీలు. అందుకే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విడుదల చేసిన వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం సహా ట్రంప్ అహ్మదాబాద్‌లోని మోతేరాలో చేసిన ప్రసంగం బైట్‌ను.. రిపబ్లికన్ల ప్రచార వీడియోలో జోడించారు.
-
America enjoys a great relationship with India and our campaign enjoys great support from Indian Americans! 👍🏻🇺🇸 pic.twitter.com/bkjh6HODev
— Kimberly Guilfoyle (@kimguilfoyle) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">America enjoys a great relationship with India and our campaign enjoys great support from Indian Americans! 👍🏻🇺🇸 pic.twitter.com/bkjh6HODev
— Kimberly Guilfoyle (@kimguilfoyle) August 22, 2020America enjoys a great relationship with India and our campaign enjoys great support from Indian Americans! 👍🏻🇺🇸 pic.twitter.com/bkjh6HODev
— Kimberly Guilfoyle (@kimguilfoyle) August 22, 2020
ట్రంప్‌ను కుటుంబంగా మోదీ అభివర్ణించడం సహా డొనాల్డ్ భారతీయుల గురించి చెప్పిన మాటలను ప్రచార వీడియోలో జతచేశారు.
"భారత్‌ను అమెరికా ప్రేమిస్తోంది. గౌరవిస్తోంది. భారతీయులకు అమెరికా ఎప్పుడూ నమ్మకమైన స్నేహితుడు. భారత ప్రజలు నిజంగా అద్భుతమైనవారు" అని ట్రంప్ బైట్‌ను ఆ వీడియోలో చేర్చారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటనకు వచ్చారు ట్రంప్. ఆయన సతీమణి మోలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్నర్ సహా పలువురు ప్రభుత్వాధికారులు భారత్‌కు వచ్చారు. మోతేరా వేదికగా 'నమస్తే ట్రంప్' పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో లక్షా 10 వేల మంది భారతీయులు పాల్గొన్నారు.
'ద రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్' వచ్చే వారం జరగనుంది. వర్చువల్‌గా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ల తరఫున తన నామినేషన్‌పై అధికారిక ప్రకటన చేస్తూ.. ఆగస్టు 27న ట్రంప్ ప్రసంగం చేయనున్నారు.