తనకు చెందిన ఓ ప్రైవేటు భూభాగంలో మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం ప్రారంభించారు అమెరికా మిలిటరీ మాజీ అధికారి బ్రయాన్ కాల్ఫేజ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల నుంచి సేకరించిన విరాళాలతో ఈ కార్యక్రమం ప్రారంభించారు.
'వియ్ బిల్డ్ ద వాల్' అనే సంస్థను ప్రారంభించి ఆన్లైన్లో 20 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించారు కాల్ఫేజ్. ఈ నిధులతోనే ప్రైవేటు భూభాగంలో అమెరికా-మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం ప్రారంభించారు. ట్రంప్ ఎన్నికల హామీని కాంగ్రెస్ అడ్డుకున్నా ఆయన మద్దతుదారులమంతా ఏకమై సరిహద్దు గోడ నిర్మాణం చేపడతామన్నారు ఆ భూమి సహ యజమాని జెఫ్ అలెన్.
దాదాపు 800 మీటర్ల మేర ఉన్న తన ప్రైవేటు భూమిలో ప్రభుత్వం ఎలాంటి గోడను నిర్మించాలనుకుందో అదే ప్రమాణాలతో నిర్మాణం జరుగుతుందని చెప్పారు అలెన్.
మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి నిధుల మంజూరు చేసేందుకు నిరాకరించింది కాంగ్రెస్. దీంతో గోడ నిర్మాణానికి నిధులు సమకూర్చుకునేందుకు అత్యయిక స్థితి విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. రక్షణ శాఖ నిధులను మళ్లించేందుకు ట్రంప్ చేస్తున్న పరిపాలన విధమైన ప్రయత్నాలను నిలిపేస్తూ తీర్పునిచ్చింది న్యాయస్థానం.
ఇదీ చూడండి: ఒక్క ప్రశ్నకు.. 10 వేల సమాధానాలు