అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన తెంపరితనంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూనూ ఆకస్మికంగా ముగించారు. ఛానల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను ఛానెల్ లో ప్రసారానికి ముందే విడుదల చేస్తానని తెలిపారు.
ట్రంప్‌తో ప్రముఖ జర్నలిస్ట్ లాస్లే స్టాల్ 'సీబీఎస్ న్యూస్ 60 మినిట్స్'లో ఇంటర్వ్యూ నిర్వహించారు. వాస్తవానికి అది వచ్చే ఆదివారం ప్రసారం కావాల్సి ఉంది. ఈ క్రమంలో వరుస ట్వీట్లు చేశారు ట్రంప్. ఇంటర్వ్యూ సందర్భంగా లాస్లే స్టాల్ మాస్క్ ధరించలేదని సూచిస్తూ.. ఓ వీడియోను పోస్ట్ చేశారు.
" లాస్లే స్టాల్‌తో 60 నిమిషాల ఇంటర్వ్యూను అనుకున్న ప్రసార తేదీ కంటే ముందే విడుదల చేస్తానని మీకు తెలియజేస్తున్నా. దాని ద్వారా ప్రతి ఒక్కరు ఒక నకిలీ, పక్కదారి పట్టించే ఇంటర్వ్యూ అంటే ఏమిటో తెలుసుకుంటారు. ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలను ఇటీవల జో బైడెన్ ఇంటర్వ్యూలతో పోల్చి చూడాలి. "
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
లాస్లేతో ఇంటర్వ్యూ తర్వాత శ్వేతసౌధం నుంచి నేరుగా.. పెన్సిల్వేనియా ఏరీ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీకి వెళ్లారు ట్రంప్.
ఇదీ చూడండి: ' అందులో నేనే కింగ్- లాబీయిస్టులకు బైడెన్ సేవకుడు'