కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర కృషి జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13 వ్యాక్సిన్‌లు తుది/మూడోదశ ప్రయోగాలకు చేరుకున్నాయి. రష్యా, చైనా మినహా వీటిలో మొత్తం నాలుగు టీకాలు ఇప్పటికే అత్యవసర వినియోగం కింద అనుమతి పొందాయి. వీటిలో భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ కూడా ఉంది. చైనా సినోఫార్మ్, రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్‌ల పంపిణీ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో కోటీ 20లక్షల మంది వ్యాక్సిన్‌లు తీసుకున్నట్లు సమాచారం.
ఇక, కొవిడ్ మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన వ్యాక్సిన్‌లు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 154కు పైగా ప్రీ-క్లినికల్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం 20 వ్యాక్సిన్‌లు తొలి దశ ప్రయోగాలను కొనసాగిస్తుండగా, మరో 16 వ్యాక్సిన్‌లు రెండో దశలో ఉన్నాయి. ఇక 13 వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాల్లో నిమగ్నమయ్యాయి. తుది దశ ప్రయోగాలను కొనసాగిస్తున్న 13 వ్యాక్సిన్‌లలో ఫైజర్-బయోఎన్‌టెక్‌లు రూపొందించిన వ్యాక్సిన్‌కు బ్రిటన్ మొదటగా అనుమతి ఇచ్చింది. తర్వాత మోడెర్నా తయారుచేసిన వ్యాక్సిన్ అమెరికాలో అనుమతి పొందగా, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు తాజాగా బ్రిటన్ అనుమతి ఇచ్చింది. అదే సమయంలో చైనాకు చెందిన సినోఫార్మ్ అక్కడి ప్రజా వినియోగానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా తుదిదశ ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు ఇస్తున్న వ్యాక్సిన్‌లు అత్యవసర/ప్రజా వినియోగం కింద అందుబాటులోకి వస్తున్నాయి.
తొలి వ్యాక్సిన్‌గా ఫైజర్..
అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి వచ్చిన తొలి కరోనా వ్యాక్సిన్‌గా ఫైజర్ నిలిచింది. దీన్ని తొలుత బ్రిటన్ ఆమోదించగా తర్వాత అమెరికా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అనంతరం సౌదీ అరేబియా, మెక్సికో వంటి దేశాలు కూడా ఆమోదించాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఈ టీకా వినియోగానికి ఆమోదం తెలిపింది. భారత్‌లోనూ వ్యాక్సిన్ వినియోగం కోసం ఫైజర్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇక్కడి నియంత్రణ సంస్థలు వీటిపై నిర్ణయం తీసుకోలేదు. ఈ టీకాను అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతల (మైనస్ 70డిగ్రీల సెల్సియస్) వద్ద నిల్వ చేయాల్సి ఉండడం ఒక సవాలుగా మారిందనే చెప్పవచ్చు.
మోడెర్నా..
కరోనా వ్యాక్సిన్‌లో ముందున్న మోడెర్నా అమెరికాలో అనుమతి పొందిన రెండో టీకాగా రికార్డుకెక్కింది. అధ్యక్ష ఎన్నికల నాటికి అమెరికాలో తొలుత మోడెర్నా వ్యాక్సిన్ వస్తుందని భావించారు. కానీ, అప్పటివరకు ఏ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు. ఇక వ్యాక్సిన్ సమర్థత 94.1శాతం ఉన్నట్లు మోడెర్నా ఇదివరకే ప్రకటించింది. అంతేకాకుండా ఫైజర్‌తో పోలిస్తే మోడెర్నా వ్యాక్సిన్‌ను కాస్త తక్కువ (మైనస్ 20 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకునే సౌలభ్యం ఉంది. అయినప్పటికీ ఫైజర్‌తో పాటు మోడెర్నా టీకాను అమెరికాలో భారీ స్థాయిలో పంపిణీ చేస్తున్నారు.
మూడో వ్యాక్సిన్‌గా ఆస్ట్రాజెనెకా..
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన వ్యాక్సిన్‌పై యావత్ ప్రపంచం ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. అత్యంత తక్కువ ధర, సాధారణ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేసుకునే సౌలభ్యంతో పాటు సురక్షితమైనదని తేలడంతో ఈ వ్యాక్సిన్‌ను గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్నారు. ఇక ఈ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చిన తొలి దేశంగా బ్రిటన్ నిలువగా, తాజాగా భారత్ కూడా ఆమోదం తెలిపింది. టీకా సామర్థ్యం 70శాతం ఉన్నట్లు బ్రిటన్, భారత్‌లలోని నియంత్రణ సంస్థలు ధ్రువీకరించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ఏర్పడ్డ ‘గవి’ కూటమి ద్వారా యావత్ ప్రపంచ దేశాలకు ఈ టీకాను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తొలి దేశీయ వ్యాక్సిన్‌గా భారత్ బయోటెక్..
భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేస్తున్న ఆక్స్‌ఫర్డ్ టీకాతో పాటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన కొవాగ్జిన్ కూడా అత్యవరసర వినియోగం కింద భారత్‌లో అనుమతి పొందింది. దీంతో భారత్‌లో అనుమతి పొందిన తొలి స్వదేశీ వ్యాక్సిన్‌గా కొవాగ్జిన్ నిలిచింది. ఈ వ్యాక్సిన్‌ను కూడా సాధారణ ఉష్ణోగ్రతల (2-8డిగ్రీల సె.) వద్ద నిల్వ చేసుకునే సౌలభ్యంతో పాటు ధర కూడా తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.
వీటితోపాటు అమెరికాలో జాన్సన్&జాన్సన్ తయారుచేసిన వ్యాక్సిన్ ప్రయోగ సమాచారాన్ని జనవరిలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మూడో దశ ప్రయోగాలను దాదాపు 60 వేల మందిపై జరపాలని తొలుత భావించినప్పటికీ ప్రస్తుతం ఆ సంఖ్యను 40వేలకు తగ్గించుకుంది. దీంతో త్వరలోనే వ్యాక్సిన్ సమర్థతపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రయోగాలు లాటిన్ అమెరికా, యూకేలలో జరుగుతున్నాయి. ఒకవేళ వ్యాక్సిన్ సురక్షితమని తేలితే 2021 చివరి నాటికే దాదాపు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను తయారుచేసేందుకు జే&జే ఏర్పాట్లు చేస్తోంది.
అమెరికాకు చెందిన నొవావాక్స్ తయారుచేసిన వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాలు బ్రిటన్‌లో కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలోనే వ్యాక్సిన్ ప్రయోగ సమాచార విశ్లేషణ పూర్తికానున్నట్లు సమాచారం. తుది దశ ప్రయోగాలను అటు అమెరికాలోనూ భారీ స్థాయిలో జరిపేందుకు నొవావాక్స్ సిద్ధమవుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికాలోనూ నొవావాక్స్ ప్రయోగాలు చేస్తోంది.
ఇక ఫ్రాన్స్‌కు చెందిన సఫోని, బ్రిటన్‌కు చెందిన గ్లాక్సోస్మిత్‌క్లైన్ తయారు చేసిన వ్యాక్సిన్‌లు, ప్రయోగాల్లో ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో మరోసారి జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక కెనడాలోని మెడికగో తయారుచేసిన వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి.
రష్యా, చైనాల దారే వేరు..
కరోనా వ్యాక్సిన్ తయారీలో చైనా, రష్యా దేశాల దారే వేరని చెప్పవచ్చు. అయితే, కరోనా వైరస్‌కు పుట్టినిళ్లైన చైనాలో వ్యాక్సిన్ ఆరు మాసాల ముందే తయారయ్యింది. ఇప్పటివరకు అక్కడ నాలుగు వ్యాక్సిన్‌లు తుదిదశ ప్రయోగాల్లో ఉండగా.., జులై నెలలోనే అత్యవసర వినియోగం కింద లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటివరకు అక్కడ దాదాపు 45 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు సమచారం. ఇక ఫిబ్రవరిలో అక్కడ జరుపుకొనే చైనా నూతన సంవత్సరం నాటికే 5కోట్ల మందికి వ్యాక్సిన్ అందించే లక్ష్యాన్ని పెట్టుకుంది. సాధారణ ప్రజలు వినియోగించేందుకు అనుమతిస్తున్నట్లు చైనా డిసెంబర్ 31న ప్రకటించింది. అయితే, చైనా వ్యాక్సిన్‌లపై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విమర్శల నేపథ్యంలో తాజాగా సినోఫార్మ్ తయారుచేసిన వ్యాక్సిన్ 79శాతం సమర్థత చూపించిందని ప్రకటించుకుంది.
ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ రూపొందించిన తొలి దేశంగా రష్యా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. రష్యాకు చెందిన గమలేయా ఇన్‌స్టిట్యూట్ సాయంతో అక్కడి ఆర్‌డీఐఎఫ్ కలిసి స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను రూపొందించింది. వ్యాక్సిన్ సురక్షితంగా ఉందని పేర్కొనడంతో పాటు 91.4శాతం సమర్థత కలిగినట్లు గమలేయా ఇదివరకే ప్రకటించింది. అత్యవసర వినియోగం కింద రెండు నెలల క్రితమే టీకా పంపిణీ ప్రారంభించిన రష్యా, ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ వ్యాక్సిన్ పంపిణీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశలో దాదాపు 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం సంకల్పించింది.