అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తిరగరాసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విశ్వప్రయత్నాలు ఒక్కొక్కటిగా బయటపుడుతున్నాయి. 'నాకు ఓట్లు కావాలి' అంటూ జార్జియా రిపబ్లికన్ అధికారికి ట్రంప్ చేసిన ఫోన్‌కాల్‌కు సంబంధించిన ఆడియో టేప్ ఇప్పటికే కలకలం సృష్టించింది. తాజాగా.. ఇలాంటి ఘటనే మరొకటి బయటపడింది. రిపబ్లికన్ పార్టీకి అత్యంత కీలకమైన జార్జియాలో గెలుపొందేందుకు 'ఎన్నికల్లో జరిగిన మోసాన్ని' బయటపెట్టమని ఓ దర్యాప్తు అధికారిపై ట్రంప్ డిసెంబర్లో ఒత్తిడి తెచ్చారు. అలా చేస్తే 'నేషనల్ హిరో' అవుతారని ఆ అధికారికి ట్రంప్ తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కథనాన్ని అగ్రరాజ్యంలోని ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించింది.
అయితే ఆ అధికారి తన పేరును బయటపెట్టేందుకు ఇష్టపడలేదు.
సొంత పార్టీలో ట్రంప్‌పై వ్యతిరేకత
మరోవైపు అమెరికా క్యాపిటల్‌లో జరిగిన హింసాకాండపై రిపబ్లికన్ పార్టీ సెనేటర్ పాట్ టూమీ స్పందించారు. అభిశంసన చేపట్టే విధంగా ట్రంప్ నేరాలకు పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు. కానీ ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు ఓటు వేస్తారా? లేదా? అన్నదానికి మాత్రం సమాధానం చెప్పలేదు.
ట్రంప్‌ను వీలైనంత త్వరగా గద్దె దింపాలని డెమొక్రాట్లు భావిస్తున్న తరుణంలో సొంత పార్టీ నేతలే ట్రంప్ చర్యలను తప్పపట్టడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
క్యాపిటల్ ఆందోళనలకు బాధ్యత వహిస్తూ..
క్యాపిటల్ భవనం ఆందోళనల్లో పాల్గొన్నందుకు నైతిక బాధ్యత వహిస్తూ వెస్ట్ వర్జీనియా చట్టసభ సభ్యులు డెర్రిక్ ఇవాన్స్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ జిమ్ జస్టిస్‌కు అందించారు. అనుమతి లేని క్యాపిటల్ భవనం వద్ద ఆందోళనలు చేసిన నేపథ్యంలో ఇవాన్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకవేళ నేరం రుజువైతే అయనకు ఒకటిన్నర సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : ట్రంప్‌కు మరో షాక్- సెనేట్‌పై డెమొక్రాట్ల పట్టు