అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం గురించి ఏమైనా చెబితే తొందరపాటు చర్యే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ది హిల్ పత్రిక కథనం ప్రచురించింది.
" 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ గురించి ఏమైనా చెబితే.. అది తొందరపాటు చర్య అవుతుంది. చాలా గొప్ప ఎన్నికలు ముందున్నాయి. నేను దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. కానీ, నాకు బ్రహ్మాండమైన మద్దతు ఉంది."
-అమెరికా మాజీ అధ్యక్షుడు, డొనాల్డ్ ట్రంప్
శ్వేతసౌధం వీడిన అనంతరం నుంచి దాదాపు నెలరోజులుగా ట్రంప్.. మీడియాకు కనిపించకుండా ఉన్నారు. కానీ, బుధవారం రేడియో దివంగత వ్యాఖ్యాత రష్ లింబాకు నివాళులు అర్పించేందుకు ఆయన బయటకు వచ్చారు. ఈ క్రమంలో విలేకరులతో మాట్లాడారు.
తాను ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కొవిడ్ వ్యాక్సిన్లు ఏమీ లేవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలపై ట్రంప్ ఘాటుగా స్పందించారు. 'బైడెన్ అబద్ధమైనా చెప్తుండాలి లేదా ఆయనకు మానసికంగా ఏమైనా సమస్యలైనా తలెత్తి ఉంటాయ'ని ట్రంప్ విమర్శించారు.
ట్విట్టర్, ఫేస్బుక్ ఇటీవల ట్రంప్ ఖాతాలను నిషేధించిన నేపథ్యంలో.. సామాజిక మాధ్యమాలతో అనుసంధానమవ్వడానికి ఇతర మార్గాలను అన్వేషిస్తున్నానని ట్రంప్ చెప్పారు.
ఇదీ చదవండి:'అమెరికాకు భారత్ కీలక రక్షణ భాగస్వామి'