అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అమెరికన్లు ఈ సారి ఎవరికి ఓటు వేస్తారని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మిగిలిన ప్రపంచమంతటికంటే భారత్‌లో ఈ ఆసక్తి మరింత అధికం! కారణం -భారతీయ సంతతి ప్రజలు. ఓటు హక్కున్న వారు భారీ సంఖ్యలో ఉండటమే. ఇంతకూ వారి ఓటు ఈసారి ఎటువైపు ? డొనాల్డ్ ట్రంప్‌కా? జో బైడెన్కా?
మన వాళ్లది రెండోస్థానం!
అమెరికాలో నివసిస్తూ, ఓటు హక్కున్న వీదేశీ సంతతి ప్రజల్లో అత్యధికులు మెక్సికన్లు కాగా... రెండోస్థానం భారతీయులదే! దాదాపు 46లక్షల మంది భారతీయులు అమెరికాలో ఉన్నారు. వారిలో సుమారు 25 లక్షల మందికి ఓటు హక్కుంది. నాలుగేళ్ల కిందటితో పోలిస్తే ఈ సారి భారతీయ అమెరికన్ల సంఖ్య 4 లక్షలు పెరిగిందని అమెరికా సెస్సెస్ అంచనా!
మొదట్నుంచీ వారికే మొగ్గు...
అమెరికా ఓటర్లలో ఆసియా-అమెరికన్లు 4.7శాతముంటారు. వీరి ఓటువేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. ఆసియన్లలో భారతీయులే అత్యధికంగా ఓటింగ్‌కు వస్తారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఈ ఆసియా ఓటర్లలో-భారతీయులే అత్యధికంగా 62 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత సంతతి ఓటర్లు మొదట్నుంచీ డెమొక్రాట్లకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. గత అధ్యక్ష ఎన్నికల్లో కూడా మెజార్టీ భారతీయులు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మద్దతిచ్చారు.
మరి ఈసారి మారేనా ?
గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు ఓటు వేసిన భారతీయ అమెరికన్లు 10-15 శాతం కూడా ఉండరని అంచనా! కానీ ఈసారి పరిస్థితిలో మార్పు వస్తుందని రిపబ్లికన్లు ఆశతో ఉన్నారు. కారణం భారత్-అమెరికా దోస్తానా, అంతర్జాతీయంగా చైనాతో విభేదాలు. కాశ్మీర్ అంశంపై డెమొక్రాట్ల భారత వ్యతిరేక వైఖరి.. రిపబ్లికన్ పార్టీ పట్ల భారతీయులు మొగ్గు చూపుతారని భావిస్తున్నారు.
ఆ రాష్ట్రాల్లో కీలకమే...
అమెరికాలో దాదాపు 25లక్షల మందికి ఈసారి ఎన్నికల్లో ఓటు హక్కుంది. ఫ్లోరిడాలో దాదాపు 2 లక్షల మంది; పెన్సిల్వేనియాలో లక్షా 70వేల మంది, జార్జియాలో లక్షన్నరమంది, నార్త్ కరోలినాలో లక్షా10వేలు, వర్జీనియాలో లక్షా65వేలు, టెక్సాస్‌లో సుమారు 4లక్షల 70వేల మంది ఉన్నారు.
సంపన్నులు ట్రంప్ వైపు...
అత్యధిక ఆదాయం, ఆస్తులున్న భారతీయ అమెరికన్లు మాత్రం ఇంకా ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నారు. కారణం ధనికులకు ఆయన పన్ను తగ్గించారు. నాలుగేళ్లలో స్టాక్ మార్కెట్ కూడా పుంజుకుంది. అత్యధిక ఆదాయవర్గాలు ట్రంప్ వైపున్నాయి. మోదీతో దోస్తానా అనే కారణంతో భారతీయులంతా గంపగుత్తగా ఏమీ ట్రంప్‌నకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. తమ వ్యక్తిగత, స్థానిక ప్రాధాన్యతలు చూసుకున్నాకే భారత విదేశాంగ విధానం వీరిని ప్రభావితం చేస్తుంది. ట్రంప్‌కు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పట్టుంది. వలస వచ్చిన వారి పట్ల స్థానికుల్లో వ్యతిరేక భావల్ని రెచ్చగొడుతున్నారు.
కమలకు కశ్మీరే అడ్డంకి?
తనను తాను నల్లజాతీయురాలుగా పరిచయం చేసుకునే కమలా హారిస్ భారత సంతతి దగ్గరకు వచ్చేసరికి తన తల్లి తమిళ మూలాలను గుర్తు తెస్తుంటారు. తండ్రి కరీబియన్ అమెరికన్, కానీ, కశ్మీర్ విషయంలో ఆమె భావాలు భారత్‌కు వ్యతిరేకంగా ఉండటం చాలామందికి మిగుడుపడని అంశం. 370 ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్లో మానవహక్కులు హరించుకుపోయాయంటూ కమల హారిస్ చేసిన వ్యాఖ్యలు చాలా మంది భారతీయులకు ఆగ్రహం తెప్పించాయి. దీనితోపాటు డెమొక్రటిక్ పార్టీ చైనా పట్ల కాసింత సానుకూల వైఖరి కూడా భారతీయ ఓటర్లను ఆలోచింపజేస్తోంది. అయితే అంతర్జాతీయ అంశాల కంటే అమెరికాలో స్థానికంగా తమ జీవనాన్ని ప్రభావితం చేసేవే భారతీయ ఓటర్లుకు ప్రాధాన్యాంశాలు అవుతాయని సర్వేలు చెబుతున్నాయి.
భారత్‌తో అమెరికా సంబంధాల కంటే, అమెరికాలో తమ ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య భద్రత గురించి భారతీయ అమెరికన్లు ఎక్కువగా ఆలోచిస్తున్నారని ఇటీవల ఒక సర్వే వెల్లడించింది. ఈ విషయాల్లో ట్రంప్ కంటే బైడన్‌కు మొగ్గు ఎక్కువగా కనిపిస్తోంది. కార్నిగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, జాన్స్హాప్కిన్స్, పెన్సిల్వేనియా యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో భారతీయ అమెరికన్లు 72 శాతం మంది డెమెక్రాట్లకే మొగ్గుచూపించారు. అంతేకాకుండా... అమెరికా ఆర్థిక స్థితి, ఆరోగ్య భద్రతలు,భారత్‌తో అమెరికా సంబంధాలు కంటే ప్రాధాన్యతాంశాలుగా అక్కడి భారతీయులు గుర్తిస్తున్నామన్నారు.
-ఆనంద్ కూచిబొట్ల, సిలికానాంధ్ర వ్యవస్థాపకులు
ఇదీ చూడండి: డొనాల్డ్‌కు షాక్- బైడెన్‌కే భారతీయ అమెరికన్లు జై!