అమెరికాలో తమ కార్యకలాపాలను నిలిపేయాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సెప్టెంబరు 15లోగా ఈ సంస్థ దేశంలో కార్యకలాపాలను మూసివేయాలన్న ట్రంప్ యంత్రాంగం పరిపాలనా ఉత్తర్వును సవాలు చేస్తూ.. కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనను వినేందుకు అమెరికా అధికారిక యంత్రాంగం సిద్ధంగా లేకపోవటం వల్ల కోర్టును ఆశ్రయించడం తప్పలేదని వెల్లడించిది.
నిషేధం వెనుక సదుద్దేశం లేదు..
అధ్యక్షుడు ట్రంప్ దేశభద్రతకు సంబంధించి సదుద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకోలేదని టిక్‌టాక్ తన ఫిర్యాదులో ఆరోపించింది. ట్రంప్ జారీచేసిన ఈ ఉత్తర్వు.. రాజకీయ ఉద్దేశాలతో కూడుకున్నదని కూడా విమర్శించింది.
యాప్‌ను నిషేధించేందుకు మాతృసంస్థ సంస్థ బైట్‌డాన్స్ ఆస్తులను వదులుకోవాల్సిందిగా ఆదేశం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం అనుసరించిన విధానం.. నిష్పక్షపాతంగా లేదని సంస్థ వివరించింది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్, కామర్స్ సెక్రటరీ విల్బర్ రాస్, ఆ దేశ వాణిజ్య శాఖలపై ఫిర్యాదు చేసింది.
యూజర్ల డేటా సురక్షితం..
అమెరికన్ యూజర్లకు సంబంధించిన సమాచారం.. అమెరికా, సింగపూర్‌లలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య సురక్షితంగా ఉంటుందని టిక్‌టాక్ వెల్లడించింది.
టిక్‌టాక్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సంస్థ విక్రయానికి జరుపుతున్న చర్చల్లో ధర పెరిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, ఒరాకిల్, అల్ఫాబెట్ సహా పలు ఇతర సంస్థలు టిక్‌టాక్ కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇప్పటికే వార్తలొస్తున్నాయి. బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు మైక్రోసాఫ్ట్ అధికారికంగా స్పష్టతనివ్వడం గమనార్హం. భారత పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా టిక్‌టాక్ కొనుగోలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే భారత్‌లో టిక్‌టాక్ కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.