నాలుగు వారాలుగా జరుగుతున్న ఆందోళనలతో హైతీ అట్టుడుకుతోంది. అధ్యక్షుడు జొవెనెల్ మోయిసే రాజీనామా చేయాలని ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. శుక్రవారం ఆందోళన తీవ్రరూపు దాల్చింది. వేలాది మంది ప్రజలు హైతీ రాజధాని నుంచి ఐక్యరాజ్యసమితి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చెలరేగిన అల్లర్లలో ఇద్దరు మరణించారు. కొంతమంది ఆందోళనకారులు కత్తులు, తుపాకులు, ఇతర మారణాయుధాలతో నిరసనల్లో పాల్గొన్నారు. ఆందోళనలను అణిచివేసేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. దీంతో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు.
మద్దతు ఉపసంహరణకు డిమాండ్..
తమ అధ్యక్షుడు జొవెనెల్ మోయిసేకు అంతర్జాతీయ సమాజం ఇస్తున్న మద్దతుకు వ్యతిరేకంగా ఈ నిరసనలు చేస్తున్నారు. హింసాత్మకంగా మారిన ఆందోళనల్లో 17 మంది మరణించారు. అమెరికా సహా ఇతర దేశాలు హైతీ అధ్యక్షుడికి మద్దతు విరమించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడికి మద్దతు ఇవ్వరాదని లేఖ రాశారు నిరసనకారులు .
అక్రమాలే కారణం..
వెనిజువెలా నుంచి సబ్సిడీ ద్వారా చేసుకున్న చమురు దిగుమతులలో అక్రమాలకు పాల్పడ్డారని అధ్యక్షుడిపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత ఎవాన్ పాల్ ఆందోళనలు చేపడుతున్నారు. దీనితో పాటు దేశంలో వస్తువుల కొరతకు అధ్యక్షుడి విధానాలే కారణమని ఆరోపిస్తున్నారు. దీనిని ప్రపంచం దృష్టికి తేవడానికి ఐక్యరాజ్యసమితి సహా అమెరికా, కెనడా, ఫ్రాన్స్ దేశాల అధికారులతో చర్చలు సాగిస్తున్నారు పాల్.
అయితే తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన అధ్యక్షుడు జొవెనెల్.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.