అమెరికా సహా బ్రెజిల్, స్పెయిన్ దేశాల్లో కార్చిచ్చు మరిన్ని ప్రదేశాలకు విస్తరిస్తోంది. జంతువులు దావానలం ధాటికి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సైన్యం, అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రావడం లేదు. ఉష్ణోగ్రతల పెరుగుదల, పెను గాలులు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి.
బ్రెజిల్...
ప్రపంచంలోనే అతి పెద్ద అడవి అయిన అమెజాన్ గత కొన్ని రోజులుగా కార్చిర్చుతో రగిలిపోతోంది. భూగ్రహం మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు ఆధారమైన ఈ అడవులు కార్చిచ్చు కారణంగా దగ్ధం అవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రత, తక్కువ మొత్తంలోని ఆర్థ్రత వల్ల మంటలు చెలరేగుతున్నాయి. మంటలను అదుపు చేయడానికి బ్రెజిల్ సైన్యం విశ్వప్రయత్నాలు చేస్తోంది.
అమెరికా...
అమెరికా కాలిఫోర్నియా, ఒరెగాన్ రాష్ట్రాల్లో దావానలం వల్ల 780 చదరపు కిమీ మేర ప్రదేశం కాలిపోయింది. వందల సంఖ్యలో అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. హెలికాఫ్టర్లతో దావనలాన్ని నియంత్రించేందుకు యత్నిస్తున్నారు. అయితే ప్రతికూల వాతావరణం, గాలుల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది.
కార్చిచ్చు కారణంగా ఆదివారం 10 మంది వరకు చనిపోయినట్లు, 12 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వందల సంఖ్యలో నివాసాలు కాలిపోయాయి. ఒరెగాన్ రాష్ట్రంలో 40 వేల మందిని ఆ ప్రాంతం నుంచి తరలించారు.
స్పెయిన్...
స్పెయిన్‌లోనూ దావాగ్ని బీభత్సం సృష్టిస్తోంది. ఓరెన్స్ రాష్ట్రానికి 120 మంది సైనికులను ప్రభుత్వం సహాయక చర్యలకు తరలించింది. ఇప్పటివరకు 3 వేల హెక్టార్ల అడవి దగ్ధమైంది. వందల సంఖ్యలో ఇళ్లు కాలిపోగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది.
- ఇదీ చూడండి: శుక్ర గ్రహంపై ఆ వాయువు- జీవం ఉన్నట్లేనా?