చిలీ దేశంలో మెట్రో రేట్ల పెంపునకు నిరసనగా ప్రారంభమైన ఆందోళనలు చిలికి చిలికి గాలివానగా మారాయి. ప్రభుత్వం వెనక్కి తగ్గినా.. దేశ ఆర్థిక స్థితి, వైద్య, విద్యా రంగాల్లో అసమానతలపై గత 2 నెలలుగా చిలీ నిరసనలతో అట్టుడుకుతోంది. రాజధాని శాంటియాగోలో శుక్రవారం వేల మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు.
వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జల ఫిరంగులు, బాష్ప వాయువును ప్రయోగించారు భద్రతా సిబ్బంది. ఈ ఘటనలో వేల మంది గాయపడ్డారు. 300 మందికి పైగా తీవ్రమైన కంటి గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.
26 మంది మృతి..
అక్టోబర్ 18న మొదలైన ఆందోళనల్లో ఇప్పటి వరకు 26 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. 2210 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 188 పోలీస్ స్టేషన్లతో సహా 971 పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి.
చిలీలో మానవ హక్కులకు.. అక్కడి పోలీసులు, సైన్యం తీవ్రంగా ఆటంకం కలిగిస్తున్నాయని.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : ఆలోచన అదుర్స్... ప్లాస్టిక్ వ్యర్థాలతో టీ-షర్టుల తయారీ