కరోనాను నివారించే టీకా కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న వేళ కొత్త కుంభకోణాలు వెలుగు చూసే అవకాశాలున్నాయన్న వార్తలు ఇటు ప్రజల్ని, అటు ప్రభుత్వాల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అమెరికాలో కరోనా టీకా ఆమోదం పొందడానికి సిద్ధంగా ఉందన్న నేపథ్యంలో నేరగాళ్లు సైతం అందుకోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్కెట్లో లభ్యమయ్యే టీకాలకు నకిలీలు సృష్టించి ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు కొందరు కేటుగాళ్లు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫైజర్, మొడెర్నా, ఇతర సంస్థలు అభివృద్ధి చేస్తోన్న డజన్ల కొద్దీ టీకాల తయారీ, పంపణీ ప్రక్రియను హోమ్‌లాండ్ సెక్యూరిటీ అధికారులు ఇప్పటికే పర్యవేక్షిస్తున్నారు.
అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఇప్పటివరకూ కొవిడ్‌కు సంబంధించి ఎలాంటి టీకాకూ ఆమోదం తెలపలేదు. కరోనా చికిత్సకు ఆ సంస్థ ఇప్పటివరకు అంగీకారం తెలిపింది రెమిడెసివిర్ ఔషధానికి మాత్రమే.
సొంత గుర్తులు అవసరం..
నకిలీలకు అడ్డుకట్ట వేసే విధంగా రక్షణకు సంబంధించి టీకా తయారీ సంస్థలకు సొంత గుర్తులు ఉండాలి. కానీ రెండో విడత తయారీ వరకూ వారికి అవకాశం ఉండకపోవచ్చు. ఒకసారి టీకా అందుబాటులోకి వచ్చాక.. త్వరితగతిన పంపిణీ చేయాల్సిన అవసరం ఉండటమే దీనికి ప్రధాన కారణమని అమెరికా ప్రభుత్వానికి, వ్యాపార సంస్థలకు, వినియోగాదారులకు, సంధాన కర్తగా పని చేసే ఎస్ఐపీసీఏ లో చీఫ్ మార్కెటింగ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న కారెన్ గార్డనర్ తెలిపారు.
అధికారుల అప్రమత్తత..
నకిలీ టీకాలను గుర్తించి, వాటిని నిలువరించేందుకు అధికారులు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా టీకా ప్యాకింగ్ గురించి అవగాహన ఏర్పరుచుకోవడం, పంపిణీకి సంబంధించి తయారీ సంస్థల సమాచారాన్ని విశ్లేషించడం, పలు నకిలీ వెబ్సైట్లును గుర్తించడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు.
నకిలీలను గుర్తించడం ఎలా?
కరోనా టీకా అందుబాటులోకి రాగానే తలెత్తే నకిలీ ఉత్పత్తుల సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండేందుకు హోంమ్లాండ్ సెక్యూరిటీ అధికారులు కొన్ని సూచనలు చేశారు.
- ప్రభుత్వ అనుమతి పొందిన ఫార్మా సంస్థల నుంచే టీకాలు కొనుగోలు చేయాలి.
- కొవిడ్ టీకా ఇవ్వడానికి మీ వైద్యుడికి ప్రభుత్వ అనుమతి ఉందా? లేదా? అని చూడాలి.
- అంతర్జాలం ద్వారా టీకాలు కొనొద్దు.
- ఆశ్చర్యకరమైన ఫలితాలను చూపే టీకాలను చూసి మోసపోవద్దు.
- గుర్తు తెలియని సంక్షిప్త సందేశాలు, ఈ మెయిల్స్, ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వొద్దు. టీకాల ప్రకటనలను గుడ్డిగా నమ్మొద్దు.
- అనుమానం వస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి.