మాస్కులు ధరించడం వల్ల శ్వాసకు అవరోధం ఏర్పడి ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుందన్న ఆందోళనలు అనేక మందిలో ఉన్నాయి. అవి నిరాధార ఆందోళనలని శాస్త్రవేత్తలు తెలిపారు. మాస్కులు ధరించి వ్యాయామాలు చేయవచ్చని సూచిస్తున్నారు. మాస్కులు ధరించినప్పుడు పీల్చుకునే ఆక్సిజన్, విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ల ప్రవాహ తీరు మారిపోతుందని, ఫలితంగా శ్వాసలో ఇబ్బంది తెలత్తవచ్చన్న భయాలు నెలకొన్నాయి. ముఖ్యంగా శారీరక శ్రమ చేసే సమయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందన్న ఆందోళనలు ఉన్నాయి.
దీనిపై అమెరికా, కెనడా శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. మాస్కు వల్ల శ్వాస పనితీరు, రక్తంలోని ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువుల స్థాయి, ఇతర శారీరక పరామితులపై చాలా స్వల్ప ప్రభావమే పడుతుందని వారు తేల్చారు. కొన్నిసార్లు ఆ ప్రభావాన్ని గుర్తించడమూ కష్టమేనన్నారు. తీవ్రంగా వ్యాయామం చేసేటప్పుడూ ఈ తొడుగుల వల్ల ఊపిరితిత్తుల పనితీరులో ఇబ్బంది ఏర్పడుతుందనడానికి గట్టి ఆధారాలేమీ దొరకలేదని వారు చెప్పారు. ఈ అంశంలో స్త్రీ, పురుష లేదా వయసుపరంగా వైరుధ్యాలూ కనిపించలేదన్నారు.
అయితే.. తీవ్రస్థాయిలో ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారిలో మాత్రం ఇబ్బందులు తలెత్తవచ్చన్నారు. వీరి శ్వాసకు స్వల్ప అవరోధాలు ఏర్పడినా.. వ్యాయామ సామర్థ్యం తగ్గిపోతుందని చెప్పారు. ఇలాంటి వారు మాస్కులతో శారీరక శ్రమ చేసే అంశంపై వైద్య సలహా తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి:ఆ గ్రామంలో ఒక్కరికి మినహా అందరికి కరోనా