అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసి ఇంకా మూడు నెలలు పూర్తికాకమునుపే 2024లో జరిగే ఎన్నికల కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రతిపక్షమైన రిపబ్లికన్ పార్టీలో సందడి మొదలయింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. విరాళాలు ఇచ్చే దాతలతో ఇప్పటికే సమావేశమయ్యారు. పార్టీపై ఆయనకే గట్టి పట్టున్నా ఆయన సహచరులు మరికొందరూ పోటీ చేయడానికి ఉత్సుకత చూపుతున్నారు. వ్యూహకర్తలను నియమించుకుంటున్నారు.
క్రియాశీలకంగా ఉంటేనే..
ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తుంటే చివరకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కుతుందన్న ఆలోచనలో నేతలు ఉన్నారు. బరిలో దిగాలన్న ఉత్సాహంతో ఉన్న మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ నెలాఖరులో తొలి ప్రసంగాన్ని ఇవ్వనున్నారు. విదేశాంగ శాఖ మాజీ మంత్రి మైక్ పాంపియో కూడా రంగంలో ఉండాలని భావిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలకు వెళ్తుండటంతో పాటు, రాష్ట్రాల పర్యటన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ట్రంప్ బరిలో ఉండకపోతే తాను పోటీ చేస్తానని ఇండియన్-అమెరికన్, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ చెప్పారు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటీస్ కూడా పోటీపై ఆసక్తి చూపిస్తూ పలువురు ప్రముఖులను కలిశారు. ట్రంప్ కూడా బహిరంగ సభలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. అయోవా రాష్ట్రంలో అప్పుడే రాజకీయ సందడి మొదలయిందని రిపబ్లికన్ పార్టీ నేత జెఫ్ కౌఫ్మ్యాన్ చెప్పారు. రంగంలో ఉండే అభ్యర్థులు తొలుత ఈ రాష్ట్రానికే వస్తుంటారని తెలిపారు. మైక్ పాంపియో ఇప్పటికే ఈ రాష్ట్రానికే వెళ్లి ప్రసంగాలు చేశారు.
ఇదీ చదవండి: కమలా హారిస్‌ను చంపేస్తానంటూ బెదిరింపులు!
ఇదీ చదవండి: 'ఇండో పసిఫిక్'లో చైనాకు చెక్ పెట్టేలా అమెరికా, జపాన్ చర్చలు