చంద్రుడి పరిణామంలో మార్పుపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. చంద్రగ్రహం క్రమక్రమంగా కుచించుకుపోతోందని తెలిపింది. లూనార్ రీకానైసెన్స్ ఆర్బిటర్-ఎల్ఆర్ఓ తీసిన సుమారు 12 వేల ఛాయాచిత్రాలను పరిశీలించి... ఈ విషయాన్ని తేల్చింది నాసా.
చంద్రుని ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న ఫ్రిగోరిస్ అనే అతిపెద్ద మృత ప్రాంతం పగుళ్లు ఏర్పడి కదిలిపోతున్నట్లు గుర్తించింది. పరిణామంలో మార్పుతో చంద్రుడిపై ప్రకంపనలు, ఉపరితలంపై ముడతలు వస్తున్నాయని వివరించింది నాసా.
ఇదీ కారణం...
చంద్రునికి భూమిలాగా టెక్టానిక్ ఫలకాలు లేవు. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన చంద్రగ్రహం తన గర్భంలో జరిగే పలు రకాల చర్యలవల్ల క్రమక్రమంగా వేడిని కోల్పోతోంది. ఫలితంగా ఎండిన ద్రాక్ష పండు మాదిరిగా ముడుచుకుపోతోందని నాసా వివరించింది. ఇప్పటి వరకు చంద్రుడు సుమారు 150 అడుగులు(50 మీటర్లు) మేర కుచించుకుపోయినట్లు వెల్లడించింది నాసా.
అపోలో వ్యోమగాములు మొదటిసారిగా 1960, 1970ల్లో చంద్రునిపై ప్రకంపనల తీవ్రతను కొలిచారు. ఆల్గారిథమ్, గణితశాస్త్రాలు ఉపయోగించి విశ్లేషించి, ప్రకంపనల స్థానాలను, ప్రభావాలను కచ్చితంగా గుర్తించగలిగారు. చంద్రుని గర్భంలో ఎక్కువగా, ఉపరితలంపై తక్కువ భూకంపాలు సంభవించినట్లు కనుగొన్నారు.
ఇదీ చూడండి: నాసా "చంద్రయాన్"కు నిధుల కష్టం..!