బ్రెజిల్ సావో పాలో రాష్ట్రంలో ఉండే 'విలా ఫార్మోసా' శ్మశానవాటిక.. కరోనా మృతులతో దిబ్బగా మారింది. లాటిన్ అమెరికాలోనే అతిపెద్దదైన ఈ శ్మశానంలో.. కొవిడ్‌తో చనిపోయిన వారి మృతదేహాలను ఖననం చేస్తున్నారు. రోజూ వందల్లో శవాలు రావడం వల్ల అంత్యక్రియలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
కరోనాతో మరణించిన తన తల్లికి అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చిన డానియేలా డాస్ శాంటోస్ ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మారి తన ప్రియమైన వ్యక్తి ప్రాణాలు తీసిందని.. ఇంకా తన తండ్రినీ ఆస్పత్రిలో ఉండేలా చేసిందని విలపించారు. బుధవారం ఇదే ప్రాంతంలో తన మాతృమూర్తిని ఖననం చేస్తూ.. డానియేలా కన్నీటిపర్యంతమయ్యారు. బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసిన తన తల్లి.. ఆనారోగ్యంతో 20 రోజులకుపైగా ఆసుపత్రిలోనే గడిపారని చెప్పారు. చనిపోవడానికి ఒకరోజు ముందే పరీక్షల్లో ఆమెకు వైరస్ నిర్ధరణ అయ్యిందన్నారు.
" ఈ వైరస్ చాలా నిశ్శబ్దంగా వస్తోంది. ఇక్కడ చూడండి నేను నా తల్లిని ఖననం చేస్తున్నా. నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు. మా అమ్మ 57 ఏళ్ల వయసులోనే చనిపోయింది. నిన్నటి నుంచి మా నాన్న కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏ సమయంలోనైనా ఆయననూ కోల్పోవచ్చు.
-- డానియేలా డాస్ శాంటోస్
కుప్పలుతెప్పలుగా మృతదేహాలు శ్మశానానికి రావడం వల్ల.. తన ప్రియమైన వారిని ఆఖరిసారి కళ్లారా చూసుకునే భాగ్యం కూడా లేకుండా పోతోందని డానియేలా ఆవేదన చెందారు.
బ్రెజిల్లో ఇప్పటివరకు 18,894 మంది మహమ్మారికి బలయ్యారు. 2 లక్షల 93,357 మందికి కరోనా సోకింది. లాటిన్ అమెరికా దేశాల్లో అత్యధిక కరోనా మరణాలు సంభవించింది ఇక్కడే. ఇక సావో పాలో రాష్ట్రంలోనే ఇప్పటివరకు 5,300 మంది కరోనాతో మృతి చెందారు. సమారు 70 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.