వాతావరణ మార్పులతో భూతాపం పెరిగి మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు.. భూమి చుట్టూ తిరిగే చంద్రుడి కక్ష్యను మార్చటం లేదా సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కక్ష్యను మార్చితే పరిష్కారం లభిస్తుందా? అని ఓ సీనియర్ అధికారిని అడిగారు లూయీ గోహ్మెర్ట్.
అయితే.. ఈ ప్రశ్నను నాసాలో పని చేస్తున్న వారినో, కనీసం పెంటగాన్ అధికారులనో అడగలేదు. సహజ వనరుల కమిటీలోని అటవీ శాఖ సీనియర్ అధికారి జెన్నిఫర్ ఎబెర్లియన్ను అడగటం గమనార్హం.
"అటవీ శాఖ, ల్యాండ్ మేనేజ్మెంట్ ద్వారా నేను అర్థం చేసుకున్నాను. మీరు వాతావరణ మార్పుల సమస్య పరిష్కారం కోసం చాలా పని చేయాలనుకుంటున్నారు. చంద్రుడు, భూమి కక్ష్యను మార్చే అవకాశం ఉన్నట్లు గతంలో నాసా మాజీ డైరెక్టర్ ఒకరు చెప్పారు. సూర్యుడి నుంచి ఉష్ణం గణనీయంగా వెలువడుతోందని మనకు తెలుసు. కాబట్టి.. చంద్రుని కక్ష్య మార్గాన్ని లేదా సూర్యుడి చుట్టూ భూమి కక్ష్యను మార్చడానికి జాతీయ అటవీ శాఖ లేదా ల్యాండ్ మేనేజ్మెంట్ విభాగం ఏదైనా చేయగలదా? సహజంగానే అది మన వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. "
- లూయీ గోహ్మెర్ట్, రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు
లూయీ ప్రశ్నకు స్పందించిన అటవీ అధికారి ఎబెర్లియన్.. అందుకు ఉన్న మార్గాలేంటో చెప్పాలని ఎదురు ప్రశ్నించారు.
వాతావరణ మార్పులపై సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించవచ్చనే దానిపై దృష్టి సారించిన కాంగ్రెస్ సైన్స్, స్పేస్, టెక్నాలజీ కమిటీ ఏర్పాటైన మూడు సంవత్సరాల తర్వాత లూయీ గోహ్మెర్ట్ ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. వాతావరణ మార్పు అనేది ఖగోళ వస్తువుల కక్ష్యలలో సహజ మార్పుల వల్ల కలుగుతుందనే ఒక నమ్మకాన్ని వ్యక్తపరచటానికే గోహ్మెర్ట్ ప్రయత్నిస్తున్నారని కొంతమంది పరిశీలకులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: వాతావరణ మార్పులతో ముసురుతున్న ముప్పు!