అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్‌తో తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వైరస్ కారణంగా సోమవారం ఒక్కరోజే 139 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 550కి చేరింది.
గత 24 గంటల్లో 10,000 మందికి వైరస్ సోకగా మొత్తం బాధితుల సంఖ్య 43,700కు చేరింది. అగ్రరాజ్యం పరిస్థితే ఇలా ఉంటే.. మరి చిన్నాచితకా దేశాల సంగతేంటి అనేదే ఇప్పుడు అందరి ప్రశ్న.
ఎందుకిలా?
వైరస్ ప్రభావం అమెరికాపై తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కరోనా నియంత్రణలో జరిగిన తప్పులను సమీక్షిస్తుంది అగ్రదేశం. వ్యాధి నిర్ధరణ కోసం చేపట్టిన పరీక్షా విధానాల్లో లోపమే తాజా పరిస్థితికి కారణంగా తేల్చారు అధికారులు. తమ లోపాలను సవరించుకోవాలని నిర్ణయించారు. వైరస్ నియంత్రణకు సరిపడా పరీక్షా కేంద్రాలు లేకపోవడం వల్ల అమెరికా ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాధి నిర్ధరణ పరీక్షా కేంద్రాలు అన్ని సౌకర్యాలతో ఉన్నాయని మార్చి నెల ప్రారంభంలో ప్రకటించారు. అయితే ఇప్పటికీ పలువురు వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయించుకోలేక పోతున్నారు. అమెరికాలో తొలిసారి వైరస్ బయటపడిన ఫిబ్రవరి నెలలో కేవలం 352 మందికే పరీక్షలు జరిగినట్లు సమాచారం. ఈ లెక్కన రోజుకు కేవలం 12 మందికే పరీక్షలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై డబ్ల్యూహెచ్ఓ అధిపతి టెడ్రోస్ స్పందించారు.
"ఇలాంటి వైరస్‌తో కళ్లు మూసుకుని పోరాడలేం. ఎవరికి సోకిందో తెలియకుండా వైరస్ నియంత్రణ చర్యలు తీసుకోలేం."
-టెడ్రోస్ అధానోం, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి
అయితే అమెరికా ఆరోగ్య శాఖ వైరస్ ప్రభావాన్ని అంతర్గతంగా అంచనా వేసింది. తాము చేసిన పొరపాట్లను సమీక్షించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరీక్షా విధానం కాకుండా మరో పరీక్షను ఎంచుకోవడం తప్పని తేల్చింది. అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం తయారు చేసిన విధానం సంక్లిష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు అధికారులు. ప్రైవేటు పరీక్షా సంస్థల సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చూడండి: చైనాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు