అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో అనూహ్య మలుపు. అత్యంత కీలక రాష్ట్రాల్లో ఒకటైన మిషిగన్‌లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ఆధిక్యంలోకి వెళ్లడం వల్ల ఎన్నికల సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఒక్క రాష్ట్రాన్ని బైడెన్ చేజిక్కించుకుంటే.. ఇక మ్యాజికల్ ఫిగర్ 270ని అందుకోవడం చాలా సులభమని నిపుణులు చెబుతున్నారు.
అనేక రాష్ట్రాల్లో ఆది నుంచి అధ్యక్షుడు ట్రంప్‌పై బైడెన్ ఆధిక్యంలోనే ఉన్నారు. కానీ అభ్యర్థుల ఓట్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో స్వింగ్ స్టేట్స్ కీలకంగా మారాయి. వీటిల్లో చాలా రాష్ట్రాల్లో రిపబ్లికన్ల జోరు కొనసాగుతుండటం వల్ల ట్రంప్ గెలుపు ఖాయమని అందురు అనుకున్నారు.
అయితే 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న మిషిగన్లోనూ కొద్ది గంటల ముందు వరకు ట్రంప్ ఆధిపత్యం చెలాయించారు. అనూహ్యంగా పుంజుకున్న బైడెన్.. అధ్యక్షుడిని దాటి దూసుకెళ్లారు. అభ్యర్థుల ఓట్ల మధ్య తేడా తక్కువే ఉండటం వల్ల ఎప్పుడేం జరుగుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
విస్కాన్సిన్(10), నార్త్ కరోలైనా(15), పెన్సిల్వేనియా(20), మిషిగన్(16), జార్జియా(16), నెవాడా(6) లో ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. విస్కాన్సిన్, మిషిగన్, నెవాడా మినహా ఇతర రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. మిషిగన్‌లో పుంజుకోకుంటే ట్రంప్ మరోమారు శ్వేతసౌధానికి చేరుకోవడం కష్టమేనని తెలుస్తోంది.
ఇదీ చూడండి:- అగ్రరాజ్య ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల హవా