భారత్‌లోని అట్టడుగు వర్గాలకు చెందిన కొందరు కార్మికులను అమెరికా తీసుకెళ్లి.. వెట్టి చాకిరి చేయిస్తున్నారు. న్యూజెర్సీలోని ఓ హిందూ ఆలయం నిర్మించే పనిలో నియమించి అతి తక్కువ వేతనం చెల్లిస్తున్నట్లు ఫెడరల్ కోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.
కార్మికుల వెట్టి చాకిరి అంశంలో హిందూ సంస్థ 'బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ-బీఏపీఎస్'కు చెందిన నేతలపై ఆరోపణలు చేశారు పిటిషనర్. ఇది మానవ అక్రమ రవాణా లేదా వేతన చట్టాలను ఉల్లంఘించినట్లుగా తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.
200 మంది కార్మికులు
పిటిషన్ ప్రకారం.. కనీసం ఆంగ్ల భాష మాట్లాడలేని, అర్థం కానీ 200 మంది కార్మికులను ట్రెంటోన్ నగర శివారు రొబ్బింస్విల్లేలోని హిందూ ఆలయ నిర్మాణానికి తీసుకొచ్చారు. భారత్‌లోనే వారితో అగ్రిమెంట్‌పై సంతకాలు చేయించుకున్నారు. వారంతా ఆర్-1 వీసాలపై అమెరికా చేరారు. ఇక్కడికి చేరుకోగానే వారి పాస్‌పోర్టులు లాక్కుని, బలవంతంగా రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పని చేయిస్తున్నారు. అతి కొద్ది సెలవులు ఇస్తున్నారు.
గంటకు 1.20 డాలర్లు..
రోజులో 13 గంటలు పని చేస్తున్నా సరైన వేతనం ఇవ్వటం లేదు. నెలకు కేవలం 450 డాలర్లు చెల్లిస్తున్నారు. అంటే సుమారు గంటకు 1.20 డాలర్లు మాత్రమే. అందులోనూ చేతికి కేవలం 50 డాలర్లు ఇచ్చి మిగతావి భారత్‌లోని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.
పారిపోకుండా చుట్టూ కంచె
కార్మికులు పారిపోకుండా వారు ఉండే ప్రాంతం చుట్టూ కంచె నిర్మించి కెమెరాలు, గార్డ్స్‌తో నిఘా ఉంచినట్లు పిటిషనర్ తెలిపారు. ఒకవేళ వారు అక్కడి నుంచి తప్పించుకున్నా.. వారి వద్ద పాస్‌పోర్టులు లేకపోవటం వల్ల పోలీసులు అరెస్ట్ చేస్తారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఖండించిన బీఏపీఎస్..
పిటిషన్లో డిఫెండెంట్గా పేర్కొన్న బీఏపీఎస్ సీఈఓ కాను పటేల్.. ఈ అంశంపై న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడారు. తక్కువ వేతనాలు ఇస్తున్నారనే ఆరోపణలను ఖండిస్తున్నట్లు చెప్పారు.
" ఇలాంటి సంఘనలు ఎదురైనప్పుడు సహజంగానే ఆందోళన చెందుతాం. పూర్తిస్తాయిలో నిజాలు బయటకు వచ్చిన తర్వాతే సమాధానం ఇస్తాం. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి"
- లెనిన్ జోషి, బీఏపీఎస్ ప్రతినిధి.
బీఏపీఎస్తో పాటు మరికొంత మంది పేర్లను ఈ పిటిషన్లో పేర్కొన్నారు. బకాయిలతోపాటు, నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు పిటిషనర్.
భయంకరమైన విషయం..
శ్రమ దోపిడీకి పాల్పడుతున్న భయంకరమైన కేసుగా అభివర్ణించారు కార్మికుల తరఫున వ్యాజ్యం దాఖలు చేన న్యాయవాదుల బృందంలోని సభ్యుడు, న్యాయవాది డేనియల్ వెర్నర్. 'న్యూజెర్సీలో కొన్నేళ్లుగా ఆలయ గోడల వెనక ఇది జరగటం మరింత బాధ కలిగించే విషయం. ఈ కార్మికులు అబద్ధాలు నమ్మి పని చేయటానికి అమెరికా వచ్చారు. ప్రాథమికంగా బానిసత్వంలోకి వెళ్లారు.' అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అఫ్గాన్‌లో దాడులు- రంజాన్ మాసంలో 255 మంది మృతి