కరోనాను నయం చేసేందుకు ప్రపంచ దేశాలు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే ఈ ఔషధంతో ఉన్న ప్రమాదాలను బయటపెట్టింది ఓ అధ్యయనం. గుండె వేగంలో హెచ్చుతగ్గులు, రక్తంలో చక్కెర నిల్వల క్షీణతకు దారి తీసే అవకాశం ఉందని తేల్చింది.
వైరస్ నయమయ్యేందుకు ఉపయోగిస్తోన్న హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ ఔషధం ద్వారా ఈ అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు కెనడాలోని సన్నీబ్రూక్ హెల్త్ సెంటర్ అధ్యయనంలో తేలింది.
"వైద్యులు, రోగులు క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ ఔషధాల వాడకం కొన్నిసార్లు ప్రాణాలు పోయేందుకు కారణం కావచ్చు."
-డేవిడ్ జూర్లింక్, ఫార్మసీ విభాగం, సన్నీబ్రూక్ హెల్త్ సైన్స్ సెంటర్
గుండె వేగంలో హెచ్చుతగ్గులు, రక్తంలో చక్కెర శాతంలో క్షీణతతో పాటు ఆందోళన, మృత్యుభయం వంటి మానసిక వ్యాధులకు ఈ ఔషధాలు కారణమవుతున్నట్లు తేల్చింది ఈ నివేదిక. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎక్కువకాలం తీసుకుంటే రోగనిరోధక శక్తిపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. కీళ్ల వాతము, చర్మవ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: అమెరికాలో రెండోసారి 'కరోనా వ్యాక్సిన్' ట్రయల్స్