అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం తుపాను బీభత్సం సృష్టించింది. ఒకేసారి అధిక సంఖ్యలో టోర్నడోలు విరుచుపడటం వల్ల.. ఉత్తర లూసియానాలో 300కుపైగా ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. దక్షిణ మిస్సిసిపీ రాష్ట్రంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన వాల్తాల్లో ఒకరు మరణించగా, లారెన్స్‌లో ఇద్దరు, జెఫెర్సన్ డేవిస్‌లో ముగ్గురు చొప్పున చనిపోయారు. భారీ చెట్లు, ట్రక్కులు తుపాను ధాటికి నేలకొరిగాయి. ఫలితంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
విమానాలు రద్దు..
మన్రో విమానాశ్రయంలో టోర్నరో కారణంగా భవనాలు కూలి రన్‌వేపై శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఫలితంగా విమానాల రాకపోకలు నిలిపివేశారు. 30 మిలియన్ల డాలర్ల నష్టం కలిగినట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాన్ ఫిలిప్స్ తెలిపారు.
ఆ రాష్ట్రాలకు ముప్పు...
ప్రస్తుతం మిస్సిసిపీలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలబామా, పశ్చిమ జార్జియా రాష్ట్రాలకు, తూర్పు టెక్సాస్ నుంచి తూర్పు తీరం వరకు విస్తరించి ఉన్న ప్రాంతాలకు తుపాను ముప్పు పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.